ఆ ద్వీపం పేరు మార్పు లేదు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 5:47 PM ISTఆ ద్వీపం పేరు మార్పు లేదు..!: బి.జె.పి నేత రాజా సింగ్ ట్విట్టర్ లో ఒక చిత్రాన్ని షేర్ చేసి ఏపీ ప్రభుత్వం భవానీ ద్వీపాన్ని మేరీ ద్వీపంగా మార్చబోతోందంటూ కామెంట్ చేశారు. భవానీ ద్వీపం ప్రధాన ద్వారంమీద ఉన్న మేరీమాత చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. ఈ చిత్రాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా ఆ ప్రధాన ద్వారం మీదకు చేర్చిందని రాజాసింగ్ ఆరోపించారు. ఈ చిత్రం మైక్రోబ్లాగింగ్ సైట్లలో, ఫేస్ బుక్ లో విస్తృత స్థాయిలో ప్రచారమవుతోంది.
నిజ నిర్ధారణ
కృష్ణానది తీరంలో విజయవాడ సమీపంలో భవానీ ద్వీపం ఉంది. ప్రఖ్యాతిగాంచిన కనకదుర్గమ్మ ఆలయానికి ఈ ద్వీపం అతి చేరువలో ఉన్న ఈ ద్వీపాన్ని గతంలో టూరిజం శాఖ యాత్రికులను ఆకర్షించే రీతిలో అభివృద్ధిచేసింది. ఉద్యానాలు, క్రీడా ప్రాంగణాలు, మ్యూజియం, రోప్ వే ఈ ద్వీపానికి ప్రత్యేక ఆకర్షణలు. స్థానికులుకూడా దీన్ని పిక్నిక్ స్పాట్ గా భావించి తరచూ సందర్శిస్తుంటారు.
న్యూస్ మీటర్ విజయవాడలోని భవానీ ద్వీపానికి సంబంధించిన వివిధ చిత్రాలు, వీడియోలను కూలంకషంగా పరిశీలించింది. రాజాసింగ్ ట్వీట్ చేసిన చిత్రంలో ఉన్న మేరీ మాత బొమ్మ ఆన్ లైన్ లో ఉన్న పాత చిత్రాల్లో ఎక్కడా కనిపించలేదు.
జూన్ నెల 2019లో ఓ ఫేస్ బుక్ యూజర్ ఈ చిత్రాన్ని భవానీ ద్వీపంలో ఉన్న హరిత బెర్మ్ పార్క్ ప్రవేశ ద్వారంగా చెబుతూ పోస్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని పరిశీలిస్తే దానిపై మేరీమాత బొమ్మ ఉన్నట్టుగా కనిపిస్తుంది. జూన్ నెలలోనే ఈ చిత్రాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఆధారాన్నిబట్టి చూస్తే ఇది కొత్తగా చేసిన మార్పుకాదని ధృవీకరించుకోవచ్చు.
విజయవాడలో కనకదుర్గ ఆలయం ఎంత ప్రాచుర్యాన్ని పొందిందో అలాగే గుణదలలోని మేరీ మాత ఆలయంకూడా ప్రాచుర్యాన్ని పొందిన స్థలం. ఏటా వేలాదిమంది క్రైస్తవులు ఈ చర్చ్ ని సందర్శిస్తారు. ఈ కారణాన్నిబట్టిచూస్తే విజయవాడగురించి తెలిపే రీతిలో బొమ్మలు ఉన్న భవానీ ద్వీపం ప్రధాన ద్వారంమీద మేరీ మాత బొమ్మ ఉండడంలో పెద్ద విచిత్రం ఏం లేదన్నది కొందరి భావన.
ప్రభుత్వం భవానీ ద్వీపం పేరును మేరీ ద్వీపంగా మార్చిందనడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఈ వివరాలను బట్టిచూస్తే ప్రభుత్వం అలాంటి పని చేసిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు.
ఆరోపణ : ఏపీ ప్రభుత్వం విజయవాడలోని భవానీ ద్వీపాన్ని మేరీ ద్వీపంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఆరోపణలకు ఆధారం : ట్విట్టర్, ఫేస్ బుక్ , సోషల్ మీడియా పోస్ట్ లు
నిజ నిర్ధారణ : నిజానికి ఇది భవానీ ద్వీపం ప్రధాన ప్రవేశ ద్వారం కాదు. కేవలం ఆ ద్వీపంలోని హరిత బెర్మ్ పార్క్ ప్రవేశ ద్వారం మాత్రమే. ఆ ద్వీపం పేరు మార్పు లేదు..!