కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీపీ పై ధ్వజమెత్తిన ఉత్తమ్

By రాణి  Published on  28 Dec 2019 2:55 PM IST
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీపీ పై ధ్వజమెత్తిన ఉత్తమ్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండా ఎగురవేసి, అందరికీ స్వీట్లు తినిపించారు. తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు 135 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. సీపీ అంజనీ కుమార్ కేసీఆర్ తొత్తు అని, ఆర్ ఎస్ ఎస్ ఏజెంట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన సత్యాగ్రహాన్ని అడ్డుకుంటారు గాని..ఆర్ఎస్ఎస్ చేసిన ర్యాలీకి ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు. ఐపీఎస్ కు బదులుగా అతను కేపీఎస్ (కల్వకుంట్ల పోలీస్ సర్వీస్) గా మార్చుకుంటే చేస్తున్న డ్యూటీకి సరిగ్గా సరిపోతుందన్నారు.

కాంగ్రెస్ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరమని, 1885 డిసెంబర్ 28న బ్రిటీష్ అధికారి ఏ కే హ్యూమ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుందన్నారు. 1885లో బ్రిటీష్ పాలకులకు, భారతదేశ ప్రజలకు ఒక వారధిలా ఉండి ప్రజల అవసరాలను తెలియజేసిన ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని ఉత్తమ్ గుర్తుచేశారు. 72 మంది ప్రతినిధులతో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ నేడు కోట్లాది మంది కార్యకర్తలను సొంతం చేసుకుందంటే..పార్టీలో ఉన్న క్రమశిక్షణ, సిద్ధాంతాలు, ఆశయాలు ఎంత గొప్పవో అందరూ తెలుసుకోవాలన్నారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్, నిజలింగప్ప, కామరాజ్, ఇందిరాగాంధీ, నీలం సంజీవరెడ్డి, రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహారావు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎంతో మంది గొప్పనాయకులు పార్టీ అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారని ఉత్తమ్ వివరించారు. సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం మూల సిద్ధాంతాలతో శాంతి, అహింస, పరమత సహనం వంటి ఆశయాలతో కాంగ్రెస్ ప్రజలకు సేవ చేస్తోందన్నారు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్ర్తీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి వారు కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రులుగా పనిచేసి దేశాన్ని అభివృద్ధిలో బాటలో నడిపించారన్నారు.

  • బీజేపీ పై తీవ్ర విమర్శలు

2014లో గద్దెనెక్కిన బీజేపీ అప్పటి నుంచి దేశంలో మతపరమైన ఘర్షణలకు తెరలేపుతూనే ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాల కన్నా దేశ అభివృద్ధి, సంక్షేమం కన్నా బూటకపు వాగ్ధానాలు చేస్తూ...మతపరమైన ఎత్తుగడలు వేస్తూ రాజకీయాలు చేస్తోందన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే..370 ఆర్టికల్ రద్దు, రామాలయం నిర్మాణం, ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి అనేక వివాదాస్పద అంశాలను ముందుపెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తూ రాజకీయ ప్రాధాన్యతలను పెంచుకుంటోందని మండిపడ్డారు. దేశంలో మతపరమైన తేడాలను చూపించి శాంతియుత వాతావరణాన్ని, రాజ్యాంగంలో మూలస్తంభమైన లౌకికవాదాన్ని దెబ్బతీస్తోందన్నారు. అందుకే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు.

Next Story