పీటర్సన్‌ను ట్రోల్ చేసిన యువీ
By తోట వంశీ కుమార్ Published on 21 March 2020 4:38 PM ISTఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌ను భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. పీటర్సన్ తన సోషల్‌మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేయగా.. యువీ తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు.
పీటర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను పోస్టు చేశాడు. ఓ మరుమూల ప్రాంతంలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఆ ఫోటోలో కుడిభుజంపై అందమైన పక్షి వాలిపోయి ఉంది. ఎడమవైపు గంబీరంగా చూస్తున్న ఓ చిరుతపులి, శునకం ఉన్నాయి. తాను జంతు ప్రేమికుడనే అర్థం వచ్చేలా ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన యువరాజ్ సింగ్.. పీటర్సన్‌ను అభినందిస్తూ ఎగతాళి చేశాడు. 'నైస్ ఫోటో షాప్ బ్రో' అంటూ కామెంట్ చేశాడు. ఇంకేముంది.. నెటీజన్లు కూడా పీటర్సన్‌ను ఓ ఆటఆడుకున్నారు. చివరకు పీటర్సన్ అది ఫోటోషాప్‌లో చేసిందేనని చెప్పేశాడు.
కాగా అంతకముందు పీటర్సన్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) పై హిందీలో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. వైరస్‌ను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం సూచించిన విషయాలను పాటించాలని కోరాడు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీటర్సన్ ట్వీట్‌కు స్పందించి మెచ్చుకున్నారు. 'క్రికెట్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఎన్నో జట్లను చూసిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్, మన కోసం స్పందించడానికి సిద్దంగా ఉన్నాడు. మేమందరం కూడా కరోనాకు వ్యతిరేకండా పోరాడతాం' అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన పీటర్సన్.. 'ధన్యవాదాలు మోదీజీ మీ నాయకత్వం కూడా అలాగే(విధ్వంసకరంగా) ఉందని' ప్రశంసించాడు.