ర‌విశాస్త్రి గారూ.. నేను, ధోని ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నాం : యువ‌రాజ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2020 3:37 PM GMT
ర‌విశాస్త్రి గారూ.. నేను, ధోని ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నాం : యువ‌రాజ్‌

1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు.. మళ్లీ 28 ఏళ్ల తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ‌ధుర ఘ‌ట్టానికి గడిచి గురువారం(ఏప్రిల్ 2) నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్భంగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి నాటి ఫైన‌ల్ మ్యాచ్‌లో అప్ప‌టి కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని విన్నింగ్ సిక్స‌ర్ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. అప్ప‌టి జ‌ట్టు స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. మా 1983 బృందంలాగే.. ఈ విజ‌యం మీ జీవిత‌కాలం గుర్తుండిపోతుంద‌ని నాటి ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌ల‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా ఆ ట్వీట్‌లో కేవ‌లం ఇద్ద‌రి మాత్ర‌మే ట్యాగ్ చేశాడు. దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండ్కూల‌ర్‌, విరాట్ కోహ్లీ మాత్ర‌మే.

దీన్ని చూసిన యువరాజ్‌కు ఎక్కడో కాలినట్లు అయింది. అయితే చిలిపి ఎమోజీలు పెట్టి తన మనసులోని మాటను ఈ సిక్సర్ల సింగ్ బయటపెట్టాడు. తనను ధోనిని ట్యాగ్‌ చేయకపోవడాన్ని లాఫింగ్‌ ఎమోజీలతో ప్రశ్నించాడు. ‘సీనియర్‌కు కృతజ్ఞతలు! మీరు నన్ను, మహీని కూడా ట్యాగ్ చేయవచ్చు. విజయంలో మా భాగస్వామ్యం కూడా ఉంది' అని ట్వీట్ చేశాడు.

యువ‌రాజ్ ట్వీట్ చూసిన ర‌విశాస్త్రి వెంట‌నే స్పందించాడు. ప్ర‌పంచ‌క‌ప్‌ల విష‌యానికి వ‌స్తే నువ్వెప్పుడు జూనియ‌ర్ కాదు. నువ్వో లెజెండ్ అని యువీని కీర్తించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో అటు బ్యాటింగ్..ఇటు బౌలింగ్‌తో మెరిసిన యువరాజ్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టిన యువీ.. భారత్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.Next Story
Share it