ఆ ఆరు సిక్స్ లకు పన్నెండేళ్ళు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 9:03 AM GMT
ఆ ఆరు సిక్స్ లకు పన్నెండేళ్ళు..!

యువరాజ్ సింగ్ ఈ పేరులోనే దూకుడుంది. అందరూ అవుటైన క్రీజ్‌లో యువీ ఉన్నాడంటే ఆ ధైర్యమే వేరు. తన ఆటతీరుతో సిక్సర్ల యువరాజ్‌గా యువీ పేరు తెచ్చుకున్నాడంటేనే క్రికెట్‌పై ఈ ఆటగాడి ముద్ర ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2007 తొలి టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో బాదిన ఆరు సిక్సులు యువరాజ్ ఆటకు దూరమైనా ఎప్పటికి గుర్తుంచుకునేలా చేస్తాయి.

స్టువర్ట్‌ బ్రాడ్‌కు యువీ చుక్కలు చూపించి నేటికి 12 ఏళ్లు. ఒక సిక్స్ కొట్టడానికే కొందరు ఆటగాళ్ళు కిందమీద పడుతుంటారు . యువీ మాత్రం ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు వరుసగా కొట్టేశాడు. అవతల ఉంది ఆషామాషీ బౌలర్ కాదు ..స్టువర్ట్‌ బ్రాడ్. గ్రౌండ్‌లో ఆ క్షణంలో జరిగిన చిన్న గొడవ..యువరాజ్‌ను రెచ్చిపోయేలా చేసింది. స్టేడియంలో సిక్స్‌ల వాన కురిసేలా చేసింది.

స్టువర్ట్‌బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టడమే కాదు.. 12 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

ఇకపోతే.. తొలి బంతిని డీప్‌కవర్‌లోకి సిక్స్‌ కొట్టిన యువీ..నెక్ట్స్‌ బంతిని బ్యాక్‌వర్డ్‌పాయింట్‌ దిశగా బాదాడు. మూడో బంతి డీప్‌ మిడ్‌ఆన్‌ మీదుగా గాల్లోకి లేస్తే.. నాలుగో బంతి డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో దూసుకెళ్లింది. ఐదో బంతిని స్వీప్‌షాట్‌తో కొట్టి మ్యాచ్‌ చూసేవారిని మంత్రముగ్దులను చేశాడు యువీ. ఇక ఆరో బంతి తన ఫేవరేట్ ప్లేస్‌ మీదగా కొట్టి చరిత్ర సృష్టించాడు యువరాజ్‌. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులతో గెలుపొందింది.

Next Story
Share it