'ఇదంతా పావురాల గుట్ట ఎఫెక్టే'.. టీడీపీ వారి మనస్సాక్షి చెబుతున్న అసలు నిజం..!
By Newsmeter.Network Published on 27 Dec 2019 4:24 PM ISTఆరు నెలల పాలనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను చూసి టీడీపీతోపాటు ఒకవర్గం మీడియా ఆర్తనాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం సాధారణంగానే ఒక నిర్ణయం తీసుకున్నా దాని వెనుక తమను వెంటాడే ప్రతీకార దాడి వ్యూహమే దాగి ఉందని టీడీపీ, దాని మీడియా భ్రమించి కంపిస్తున్నాయి.
ఇప్పడు రాజధాని అంశంలోనూ అదే జరుగుతోంది. చంద్రబాబు మీద, ఒక సామాజికవర్గం మీద, ఒక ప్రాంతం మీద కోపంతోనే జగన్ అమరావతిని బలహీనపరుస్తున్నారని ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ మాత్రం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్న స్వచ్ఛమైన మనసుతోనే జగన్ ఈ నిర్ణయం చెబుతోంది.
మరోపక్క, టీడీపీ, దాని అనుకూల మీడియా చెబుతున్నట్టుగానే జగన్ మోహన్‌రెడ్డి కక్షపూరితంగానే అమరావతిపై వ్యవహరిస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఆ కక్షతాలూక మూలాలను కూడా తట్టి చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా టీడీపీ అనుకూల పత్రిక నేతకు ఎదురెళ్లేవారు కాదు.
కానీ, వైఎస్ఆర్ వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఆయనే జగన్‌చేత ఒక పత్రికను ప్రారంభించడంతో అప్పటి వరకు తాము రాసిందే వార్తా.. చెప్పిందే నిజం అంటూ విర్రవీగిన మీడియా సంస్థలకు సవాల్ ఎదురైంది. అప్పటి వరకు మీడియా మొగల్‌గా కీర్తింపబడుతున్న ఓ పత్రికాధినేత పేరును ఉచ్చరించేందుకు కూడా మిగిలిన మీడియా సంస్థలు భయపడేవి.
ఆ పత్రికాధి నేతను ఎదిరిస్తే తమ పరిస్థితి కూడా ఉదయానికి తెల్లారుతుందేమోనని ఆ మీడియా సంస్థల భయం. అలాంటి పరిస్థితి నుంచి ఆ పత్రికాధినేతకు చెందిన నగ్నకార్టూన్‌ను గీసి మరీ వాయించే విప్లవం మీడియాలో తీసుకొచ్చింది మాత్రం జగనే.
వైఎస్ఆర్ - చంద్రబాబు మధ్య ఎంతటి పోటీ
దాంతో వైఎస్ కుటుంబంపై పలు మీడియా సంస్థలకు పీకలదాకా కసి ఏర్పడింది. రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య ఎంతటి పోటీ ఉన్నా అప్పట్లో కక్షలు ఒక స్థాయిని దాటేవి కాదు. చంద్రబాబూ.. మేం అధికారంలోకి వస్తే నీ అవినీతి కథ తేలుస్తామని వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్చరించారేగానీ.. సీఎం అయిన తరువాత ఎలాంటి కక్షసాధింపు చర్యలకు వైఎస్ఆర్ దిగలేదు.
చంద్రబాబు మనుషుల ఆర్థిక ప్రయోజనాలకు కూడా వైఎస్ఆర్ హయాంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ విషయాన్ని ఇటీవల జగన్ ధాటికి తట్టుకోలేక ఇతడికంటే వైఎస్ఆరే నయమంటూ చంద్రబాబు కూడా స్వయంగా అంగీకరిస్తున్నారు. అలా తాను సీఎం అయినా సరే చంద్రబాబు విషయంలో వైఎస్ఆర్ సంయమనంతోనే వ్యవహరించారు.
కానీ, వైఎస్ఆర్ చనిపోయిన తరువాత చంద్రబాబు, కొన్ని మీడియాలు కలిసి నడిపిన రాజకీయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ నేతలచేత జగన్‌పై చంద్రబాబు కేసులు వేయించారు. జగన్‌ను జైలుకు పంపడంకోసం అనేక శక్తులను, చివరకు న్యాయం చెప్పాల్సిన పెద్దలను కూడా చంద్రబాబు వాడేశారు.
నాడు జగన్‌ను జైలుకు పంపించి వికృత ఆనందం పొందారు. వైఎస్ చనిపోయిన వారానికే తన మనిషి రేవంత్‌రెడ్డి చేత వైఎస్ఆర్ మరణాన్ని కూడా హేళన చేయిస్తూ చంద్రబాబు మాట్లాడించారు. టీడీపీతో పెట్టుకుని వైఎస్ఆర్ పావురాలగుట్టలో పావురమైపోయారంటూ రేవంత్‌రెడ్డి హేళన చేసినప్పుడు మీడియా నుంచి చంద్రబాబు మనుషుల వరకు వినసొంపుగా ఆలకించారేగానీ.. అవతలివారు కూడా మనలాగే మనుషులు, అలాంటి వ్యాఖ్యలు చేస్తే వారికి బాధ కలుగుతుందని ఏనాడైనా జాలి చూపింది లేదు.
సీఎంగా చేసిన వ్యక్తి చనిపోయిన కొన్ని నెలలకే
మూడు పంటలు పండాల్సిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిన వ్యక్తులు ధర్నాలు చేస్తుంటే భావోద్వేగానికి గురయ్యామని కన్నీరు కారుస్తన్న పెద్దలు సీఎంగా చేసిన వ్యక్తి చనిపోయిన కొన్ని నెలలకే ఆయన భార్య, కూతురు, కోడలు, చీకట్లో నడిరోడ్డుపై కూర్చున్నప్పుడు అరెరే వారు కూడా మన తెలుగు ఆడపడుచులే కదా..! మరీ ఇంత క్రూరత్వంతో కూడిన రాజకీయం పనికిరాదు అంటూ ఈ పెద్దలు ఏనాడైనా తమ వారిని అదిలించారా..? అంటే అదీ లేదు.
నాడు వైఎస్ కుటుంబంపడ్డ క్షోభ చంద్రబాబు అండ్ టీమ్ కక్ష సాధింపులో భాగం కాదా..? అన్ని పార్టీలు, అన్ని వ్యవస్థలు కలిసి వైఎస్ కుటుంబంపై మూకదాడులకు తెగబడినప్పుడు నాడు ధర్మం ఏమైంది..? తమ పార్టీకి సమాంతరంగా మరో ప్రాంతీయ పార్టీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన చంద్రబాబు నాయుడు, కేసులుపెట్టి ఆస్తులు జప్తు చేయించి జగన్ మీడియాను మూసేస్తే తిరిగి తమ మీడియా సామ్రాజ్యపు కొమ్ములకు వాడి పెరుగుతుందని కొందరు మీడియా పెద్దలు కలిసి నడిపిన వికృత రాజకీయ క్రీడే నేటి ఫలితానికి కారణమని ఇప్పుడు టీడీపీ వారికి వారి మనసాక్షే చెబుతున్నట్టుగా ఉంది.