రైతులతో చర్చలకు మంత్రివర్గ ఉప సంఘం ?
By రాణి Published on 27 Dec 2019 12:22 PM ISTముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. పటిష్ట బందోబస్త్ మధ్య సీఎం సహా మంత్రులంతా సచివాలయానికి సేఫ్ గా చేరుకున్నారు. అసలు పోలీసులే లేకపోతే సీఎం, మంత్రులు ప్రజల ఆగ్రహానికి ఏమయ్యేవారో ఆ దేవుడికే ఎరుక. మూడు రాజధానుల అంశంపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాజధాని సహా రాష్ర్ట సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై ఈ భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా మంత్రి వర్గం సమావేశం మొదలైంది.
మరోవైపు అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ 29 గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం నేటికి పదవ రోజుకు చేరగా...మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీగా ఏర్పడిన నిర్మాణ దారులు, న్యాయవాదులు, వర్తక, వాణిజ్య సంఘాలు ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. వివిధ పార్టీలు ఇప్పటికే రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించాయి. రైతులకు న్యాయం చేశాకే రాజధానిని తరలించే విషయం గురించి ఆలోచించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా..ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే విషయమై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.