మా ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకుంది - సీఎం వైఎస్ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 7:43 AM GMT
మా ప్రభుత్వం రైతులను గుండెల్లో  పెట్టుకుంది - సీఎం వైఎస్ జగన్

సర్వేపల్లి , నెల్లూరు జిల్లా: పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు . రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అన్నదాతలకు నేనున్నాననే ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అన్నదాతలకు ఏడాదికి ఆర్ధిక సహాయంగా ఇచ్చే ' వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్' పథకాన్ని సీఎం జగన్ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో ప్రారంభించారు. ఈ పథకం కింద అన్నదాతలకు ఏడాదికి రూ.13,500 ఇస్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఎక్కడైతే మాట ఇచ్చారో అక్కడ నుంచే తన మాటను నిలబెట్టుకుని రైతులపై తన చిత్తశుద్దిని చాటుకున్నారు వైఎస్ జగన్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ఆర్ అనేవారు . ఆ మాటలను నిజం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారని వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు.

రైతుభరోసా పథకం ప్రారంభించిన వెంటనే రైతులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం వైఎస్ జగన్. రైతు సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. రైతు ఇంట్లో ధాన్యపు సిరులు దొర్లాలి అన్నదే తమ ప్రభుత్వ కల అని మంత్రి చెప్పారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 'వైఎస్ఆర్‌ రైతు భరోసా పథకాన్ని' 2020లో ప్రారంభించాలి. కాని...వైఎస్ జగన్ ఏడాది ముందుగానే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. రూ.12,500లకు మరో 1000లు జోడించి మొత్తం 13,500లు రైతులకు ఆర్ధిక సాయంగా ఇస్తున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. జూన్‌ నెలలో ఇవ్వాల్సిన రూ.2000 ఇప్పటికే అందించారు. మరో రూ.9,500లు అక్టోబర్‌ నెలలో జమ చేస్తారు. మరో ..రూ.2000లు సంక్రాంతి కానుకగా రైతులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించనుంది.

రైతులకు మేలు కలిగే విధంగా వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల పాత అప్పులకు జమ కట్టకుండా వారి చేతికి నేరుగా అందేలా ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు పెట్టుబడి సాయం ఐదేళ్లకు రూ.67,500 అందనుంది. కౌలు రైతుల కుటుంబాలకు కూడా రైతు భరోసాను వర్తింప చేస్తున్నారు వైఎస్ జగన్. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలవుతున్నప్పటికీ..కేవలం భూ యజమానులకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. ఏపీలో మాత్రం కౌలు రైతులకు కూడా ఆర్ధిక సాయం చేస్తున్నారని..రైతు నాయకులు చెబుతున్నారు..హర్షి స్తున్నారు.

దేశ చరిత్రలోనే రైతన్నకు అత్యధిక సాయం- సీఎం వైఎస్ జగన్

13 జిల్లాల్లోని రైతులు, కౌలు రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ అవుతాయన్నారు సీఎం వైఎస్ జగన్. పాదయాత్ర సమయంలో రైతన్న కష్టాలను ప్రత్యక్షంగా చూశానన్నారు. గత ప్రభుత్వ హయాంలో చుక్క నీటికి కూడా అన్నదాతలు అల్లాడారని చెప్పారు. జులై18, 2017న రైతు భరోసా పథకాన్ని ప్రకటించినట్లు వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. మేనిఫెస్టోలో తమ మొదటి వాగ్దానమే రైతు భరోసా అని చెప్పారు. రైతన్నల కోరిక మేరకు 8 నెలల ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మేలో రూ.7,500, అక్టోబర్ లో రూ.4,000 సంక్రాంతికి రూ.2వేలుఅకౌంట్లో వేస్తామన్నారు జగన్. రైతు భరోసా పథకాన్ని రూ.12,500 నుంచి రూ.13,500లకు పెంచామన్నారు. ఈ పథకంతో కౌలు రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Next Story
Share it