వైఎస్ జగన్‌ను అధికార పీఠాన్ని ఎక్కించిన పాదయాత్రకు రెండేళ్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 8:13 PM IST
వైఎస్ జగన్‌ను అధికార పీఠాన్ని ఎక్కించిన పాదయాత్రకు రెండేళ్లు..!

ముఖ్యాంశాలు

  • వైఎస్ జగన్ పాదయాత్రకు రెండేళ్లు
  • సంక్షేమమే కాదు..అభివృద్ధిని కూడా పట్టించుకోవాలి
  • ఇసుక కొరతపై రెండు చోట్ల ఓడిన పవన్ కూడా విమర్శలు
  • కరెంట్ కొరతపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టాలి
  • తన కోసం నిజంగా కష్టపడ్డవారిని ఇకనైనా గుర్తించాలి
  • సాక్షి నుంచి అమరావతికి డంపింగ్ ఆపాలి
  • పాలనా ఫలాలు ప్రజల్లోకి వెళ్తేనే పాదయాత్ర విజయం సాధించినట్లు

పాదయాత్రలో వైఎస్ జగన్ అడుగులు బాగానే పడ్డాయి. ప్రజలనూ బాగానే పలకరించాడు.ప్రజలతోనే ఉన్నాడు. వారి పెట్టింది తిన్నాడు. వారితోనే పడుకున్నాడు. వారి పిల్లలను ఎత్తుకున్నాడు. వేల మంది జనం మీదొచ్చి పడుతున్నా...చిరు నవ్వుతో పలకరించాడు. ఎండ, వాన, చలి ఈ మూడు కాలాలు ఏకమై వైఎస్ జగన్ పాదయాత్రను మనసారా దీవించాయి. అధికారంలోకి వచ్చాడు. 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ సీట్లు ఇచ్చి తమ గుండె చప్పుడు జగనేనని ప్రజలు ఆశీర్వదించారు.

సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 150 రోజులు దాటి పోయింది. మేనేఫెస్టో తమకెంతో పవిత్రమైందని ప్రకటించారు. ప్రతి మంత్రి కార్యాలయంలో మేనిఫెస్టో ఉండాలని ఆదేశించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలు ఒక్కోటి అమలు చేసుకుంటూ పోతున్నారు. సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నారు.

సంక్షేమమే కాదు..అభివృద్ధి కూడా కావాలి..!

అయితే..అభివృద్ధి. రాష్ట్రాభివృద్ధి కుంటు పడింది అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఐటీ పరిశ్రమ కూడా ఈ 150 రోజుల పాలనలో రాలేదు. ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ 150 రోజుల పాలనలో రాలేదు. సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేమని వైఎస్ జగన్, ఆయన సలహాదారులు గుర్తుంచుకోవాలి. 2014లో చంద్రబాబు అనుభవజ్ఞుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తాడని ఆయనకు పట్టం కట్టారు. 2019లో అత్యంతదారుణంగా ఓడించారు. ఎందుకు..అనే విశ్లేషణను సీఎం వైఎస్ జగన్ చేసుకోవాలి.

జీవోలతో జర జాగ్రత్త..!

రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగింది. ఇది వాస్తవమే. కాని..రాష్ట్రంలో రోడ్లు అధ్వానం. కరెంట్ సరిగా లేదు. తీవ్రమైన ఇసుక కొరత, పత్రికలు గొంతు నొక్కడానికి తెచ్చిన 2430 జీవో అత్యంత పాశవికం. సాక్షిని ఇబ్బంది పెట్టింది వాస్తవమే . చంద్రబాబుకు మద్దతు తెలిపే వారిని వేరే విధంగా ట్రీట్ చేయాలి. అంతేకాని..మొత్తం మీడియానే ఇబ్బంది పెట్టే జీవోలు తీసుకురాకూడదు. ప్రతిభా అవార్డులకు అబ్దుల్ కలాం పేరు తీసి..వైఎస్ఆర్ పేరు పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో రచ్చైంది.అయితే..సీఎంకు తెలిసి జరిగి ఉంటుందని నేను అనుకోను. అధికారుల అత్యుత్సాహానికి పగ్టాలు వేయాల్సిన బాధ్యత సీఎం మీదనే ఉంటుంది.

రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కూడా...!

చివరకు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్‌ కల్యాణ్ కూడా ఇసుక విషయంలోప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎస్‌ను బదిలీ చేసిన విధానంపై కూడా ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది. పాలన అంటే పాదయాత్ర చేసినంత ఈజీ కాదు అనే విషయం జగన్‌కు అర్ధమయ్యే ఉంటుంది. పాలన అంటే...అందర్నీకలుపుకుపోతూ..సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.

ప్రజలతో వైఎస్ఆర్ ఎలా ఉండేవారు...?

ఇక...పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఓ మంచి నిర్ణయం. 'స్పందన' కార్యక్రమానికి కూడా మంచి స్పందనే లభిస్తోంది.అయితే..ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయంలో జనమే జగన్‌గా ఉన్నారు . కాని..సీఎంగా అధికార పీఠం ఎక్కిన తరువాత జనం - జగన్ కు మధ్య గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ పెరగకుండా చూస్కోవాల్సిన బాధ్యత జగన్ మీదనే ఉంది. వైఎస్ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రజల కోసమే బతికారు. ప్రజల మధ్య లేనిది ఆయనకు రోజు గడిచేది కాదు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక 'రచ్చ బండ 'కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు.. అందుకే ఆయన ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రగతి భవనలో ఉండి ..ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వనట్లు..జగన్ ఉండటం సాధ్యం కాదు. కేసీర్ ఉద్యమం నుంచి పుట్టిన నేత. తిమ్మిని బమ్మిని..బమ్మిని తిమ్మిని చేయగలరు. వైఎస్ జగన్ ప్రజల మధ్య నుంచి పుట్టిన నాయకుడు. అందుకే..ఆయన ఎప్పుడూ ప్రజలతో సంబంధాలు కోల్పోకూడదు. జనమే..జగన్ బలం. ఈ విషయాన్ని ఆయన నిద్రలోనూ గుర్తు పెట్టుకోవాలి.

'సాక్షి 'నుంచి అమరావతికి డంపింగ్ ..!

ఇక..అధికారంలోకి రాగానే సాక్షి టవర్స్‌ నుంచి అమరావతికి కొంత మంది డంప్ చేశారు. ఇది వైఎస్ జగన్ స్వంత నిర్ణయమా..? ఎవరి సలహా మేరకైనా చేస్తున్నారా? అనేది పక్కన పెడితే. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ విమర్శలు పాలవుతున్నారు. సాక్షి, ఐ ప్యాక్‌ల్లో జీతాలు తీసుకుని పని చేశారు. కాని..బయట నుంచి వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు 'తమ వాడు' సీఎం కావాలని కంకణం కట్టుకుని పని చేశారు. ఇటువంటి వారిని గుర్తించడంలో జగన్ విఫలమయ్యారనే చెప్పాలి. అలాగే..గ్రామస్థాయిలో వైఎస్ఆర్ సీపీ జెండా భుజాన మోసిన వారిని గుర్తించి ..కనీసం పలకరించలేదనే విమర్శలున్నాయి.

అప్పుడే పాదయాత్ర ఫలాలు..!!

ఐదేళ్లలో అయిపోయింది..ఆరు నెలలే. ఇంకా చాలా సమయం ఉంది. పాలనలో తప్పులు దొర్లడం సహజం. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవడం విజ్ఞత. ఇప్పటికైనా తనవారు ఎవరో గుర్తుంచుకోని గౌరమివ్వాలి. కోటరీ రాజకీయాలకు స్వస్తి పలకాలి. అసమర్దులను, అవినీతి పరులను ఆమడదూరం విసిరేయాలి. చుట్టూ సమర్దులైన సలహాదారులను పెట్టుకోవాలి. చురుకుగా, సీఎం ఆలోచనలకు తగ్గట్లు పని చేసే ఆఫీసర్లను తయారు చేసుకోవాలి. అప్పుడే పాదయాత్ర ఫలాలు ప్రజలకు అందుతాయి. 3వేల 648 కి.మీ శ్రమకు ఫలితం దక్కుతుంది. 321 రోజుల పాదయాత్రకు ప్రాణం పోసినట్లు అవుతుంది.

వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్ , న్యూస్ మీటర్

Next Story