'ఆరోగ్య శ్రీ పథకం'లో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 3:20 PM GMT
ఆరోగ్య శ్రీ పథకంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు..!

అమరావతి: ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినపథకం ఆరోగ్య శ్రీ. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పేదలు కూడా తమ ఆరోగ్యంపై ధీమాగా ఉండేవారు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశాయనే చెప్పాలి. మళ్లీ..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరోగ్య శ్రీ పథకానికి మరింత మెరుగులు దిద్దుతున్నారు.

రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు

తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, సివియర్ హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం ఫించన్ మంజూరు చేసింది. నెల​కు రూ. 10 వేలు పెన్షన్‌ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీచేసింది. బోధకాలు, పక్షవాతం, ప్రమాద బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జనవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.

రోగికి అండగా ...

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు ఆర్థిక సాయం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రూ.225లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రోగికి ఎక్కువ రోజులు విశ్రాంతి అవసరమైతే.. నెలకు రూ5వేలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

పారిశుధ్య కార్మికులకు దీపావళి కానుక

ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు మేరకు వారి వేతనాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుతో పారిశుధ్య కార్మికులు నెలకు రూ. 16 వేల వరకు జీతం అందుతుంది. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.

Next Story
Share it