ఓ యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, చివరకు మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం జిల్లా కుదుర్పి మండలం అపిలేపల్లికి చెందిన యువతి కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఫీల్డ్‌ కార్యాలయంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఫిజియోథెరఫీ వర్కర్‌గా పని చేస్తోంది. ఇటీవల యువతికి నారాయణపురంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రాజేష్‌తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. యువతిని ప్రేమిస్తున్నానని, త్వరలో పెళ్లి చేసుకుంటానని వెంట తిప్పుకున్నట్లు తెలుస్తోంది.

బుధవారం ప్రియుడిని కలిసిన యువతి పెళ్లి విషయాన్ని ప్రియుడి ముందు తీసుకురాగా, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి..బ్యాంకు పని నిమిత్తం వెళ్తున్నట్లు తోటి ఉద్యోగులతో చెప్పి క్వార్టర్స్‌కు వెళ్లింది.

కాగా, తన చెల్లికి ఫోన్‌ చేసిన యువతి.. ప్రియుడి చేతిలో మోసపోయానని, తనకు బతకాలనే ఆశ కూడా లేదని, తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలన్ని చెప్పింది. చెల్లెలు ఈ విషయాన్ని తన అన్నకు చెప్పగా, వెంటనే వారంతా క్వార్టర్స్‌కు వెళ్లి తలుపులు కొట్టగా ఎంతకి తీయలేదు. కిటికీలోంచి చూడగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించారు. యువతి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సూసైడ్ నోట్లో తన ప్రేమ గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రియుడు తనను నమ్మించి మోసం చేశాడని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్ననట్లు పోలీసులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.