విశాఖలో వైసీపీ ఇన్సైడర్ ట్రేడింగ్..?
By Newsmeter.Network Published on 28 Dec 2019 2:11 PM ISTప్రస్తుత ఏపీ రాజకీయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం ఓ కుదుపు కుదుపుతోంది. కాగా, 2014లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల తరువాత రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తుళ్లూరు ప్రాంత పరిధిలో అమరావతి పేరిట రాజధానిని నిర్మిస్తామంటూ డిక్లేర్ చేశారు. రాజధాని ప్రకటన చేయడానికి పట్టిన ఆరు నెలల సమయంలో చంద్రబాబు & టీడీపీ నేతలు వారి వారి బినామీల చేత అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించారంటూ నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది.
సేమ్ సీన్ తాజా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుందని, కాకపోతే నాడు అధికారంలో టీడీపీ ఉండగా, ప్రస్తుతం వైసీపీ ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అప్పుడు వైసీపీ చేసిన విమర్శలను నేడు టీడీపీ రిపీట్ చేస్తుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం డిక్లేర్ అయ్యాక ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్‌రెడ్డి తన అనునాయుల చేత విశాఖలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించారని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అమరావతి ప్రాంతంలో టీడీపీ 4,070 ఎకరాలను చంద్రబాబు అనుయాయులు కొనుగోలు చేశారంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా క్షుణ్ణంగా వివరించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన లెక్కల్లో పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, హెరిటేజ్ ఫుడ్స్, నారా లోకేష్ వ్యాపార భాగస్వామ్యం అంటూ పలు వివరాలను వెల్లడించారు.
బుగ్గన ప్రజెంటేషన్‌తో టీడీపీ భగ్గుమంది. ఆ లెక్కలన్నీ అవాస్తవాలనీ ఖండించింది. విశాఖలో వైసీపీ చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే తమపై బురదజల్లుతున్నారన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఖరారు అన్న సమాచారం ముందస్తుగా తెలిసిన కొందరు వైసీపీ మంత్రులు వారి వారి బినామీల చేత ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో ఎటువంటి రాగద్వేషాలకు, పక్షపాతానికి తావులేకుండా పరిపాలన కొనసాగిస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున జగన్ చేసిన ప్రమాణ స్వీకారాన్ని నేడు ప్రతీ సామాన్యుడు గుర్తు చేస్తున్నాడు. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు జరిపిస్తామంటున్న జగన్ సర్కార్.. విశాఖ భూములపై కూడా దర్యాప్తు కొనసాగించాలని కోరుతున్నాడు. విశాఖ భూములకు సంబంధించిన డేటాను పబ్లిక్ డొమైన్లో గనుక పెట్టినట్లయితే అది వైసీపీకే లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.