బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాధినేని యామిని

By రాణి  Published on  4 Jan 2020 11:26 AM GMT
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాధినేని యామిని

గతేడాది నవంబర్ లో టీడీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సాధినేని యామిని శనివారం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రాజీనామా చేసిన సాధినేని..చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత పరిస్థితులు, దేశం, రాష్ర్ట రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఇతర కారణాలచేత తాను పార్టీని వీడక తప్పట్లేదని యామిని అప్పట్లో పేర్కొన్నారు.

ఏపీలో టీడీపీ పరాజయం ముందు, తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూరిపోయారు. ముందుగానే వైసీపీ గెలుస్తుందని అనుకున్నారో ఏమోగాని..ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుని చంద్రబాబుకు షాకుల మీద షాకులిచ్చారు. మరోవైపు జనసేన నాయకుల పరిస్థితి కూడా ఇదే. జనసేనలో ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన నేతలంతా చెప్పాపెట్టకుండా రాజీనామా లేఖలు పంపి పవన్ కు షాకిచ్చారు. పైగా పార్టీ మారక ముందే పవన్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా పార్టీ మారలేదు గానీ.. పవన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాపాక వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాపాక ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటంతో త్వరలోనే ఆయన కూడా ఏదొక పార్టీలోకి జంప్ అవుతారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story