పత్రికలపై ఫత్వా దేని కోసం, ఎవరి కోసం..? జగన్‌ను తప్పుదోవ పట్టిస్తుంది సలహాదారులేనా?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 12:14 PM GMT
పత్రికలపై ఫత్వా దేని కోసం, ఎవరి కోసం..? జగన్‌ను తప్పుదోవ పట్టిస్తుంది సలహాదారులేనా?!!

ముఖ్యాంశాలు

  • ప్రజాస్వామ్యం స్వేచ్ఛనిచ్చింది
  • రాజ్యాంగం హక్కులిచ్చింది
  • ప్రభుత్వాల ఫత్వాలు పళ్లు పటపట కొరికినా
  • జీవోలు ఒళ్లు విరుచుకున్నా
  • స్వేచ్ఛారాతలు ఆగవు...ఆగవుగాక ఆగవు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది? చంద్రబాబు నడిచిన బాటలో ఎందుకు నడుస్తున్నారు?. ఆయన చేసిన తప్పులనే ఈయన ఎందుకు చేస్తున్నారు?. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గురించి తెలియదా?. తెలిసే..చంద్రబాబు చేసిన తప్పులు చేస్తున్నారా..?. ఫత్వాల పేరుతో పత్రికలను భయపెట్టాలని చూస్తున్నారా..? . పాలకులు దారి తప్పుతున్నప్పుడు సలహాదారులు విలువైన సలహాలు, సూచనలతో దారిలోకి తేవాలి. ఇక్కడ జగన్ సలహాదారులే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. "కొత్తగా ఏమీ లేదు..పాత జీవోలకే స్వల్పమార్పులు చేశాం" సీఎం వైఎస్ జగన్ సలహాదారుల్లో ఒకరైన కె.రామచంద్రమూర్తి మీడియాతో చెప్పిన మాట. అంతేకాదు" ఆ జీవోలో కొత్తగా ఏమీ లేదు. తప్పుడు వార్తలు రాస్తే..కేసులు వేసే అధికారం ఇంతకు ముందు సమాచార శాఖ కమిషన్‌కు ఉండేది. ఇప్పుడు శాఖాధిపతులు, అధికారులకు ఆ అధికారాన్ని కట్టబెడుతూ స్వల్పమార్పులు చేశాం". ఏపీ ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి చెప్పారు.

ఇక...వైఎస్‌ జగన్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ . ఈయన కూడా రామచంద్రమూర్తి పలికిన పలుకులే పలికినప్పటికీ..చంద్రబాబును సపోర్ట్ చేసే మీడియాపై కత్తులు దూశారు. రాజకీయ అవసరాలు, వ్యాపార, స్వప్రయోజనాల కోసం అసత్యాలు, అభూత కల్పనలు రాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?. అని ఘాటుగానే విలేకరులను ప్రశ్నించారు. అంతేకాదు..వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను పత్రికా స్వేచ్ఛకు విఘాతంగా చూడటానికి వీల్లేదన్నారు. అప్పటి ప్రభుత్వం 2014 - 19 మధ్య తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు, అసత్య కథనాలు ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలకే జీవో తెచ్చామన్నారు దేవులపల్లి అమర్‌.

ఇద్దరు సలహాదారులది ఒక్కటే మాట. ఒక్కటే బాట అన్నట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో మీద మాట్లాడారు. మంచిదే..ఇక్కడ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మాటలను ఈ సలహాదారులు గుర్తు పెట్టుకుంటే బాగుండేది. " ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. నా ప్రత్యర్ధులు నన్ను విమర్శించినా పట్టించుకోను, ఆ విమర్శల్లో నేను నేర్చుకోదగింది వుంటే తీసుకుంటాను" అబ్రహం లింకన్ అన్న మాటలివి. ఇటువంటి మాటలు పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని వికసింపచేస్తాయి. ఫత్వాలు ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను పాతి పెడతాయి. చంద్రబాబు, వైఎస్ జగన్‌లు ఇద్దరికీ ఈ మాటలు వర్తిస్తాయి.

ఫ్రీడం ఆఫ్ స్పీచ్ మీద భారత రాజ్యాంగం ఏం చెబుతోంది..?

మన రాజ్యాంగకర్తలు స్వేచ్ఛకు పెద్ద పీట వేశారు. వాక్ స్వాతంత్రానికి సింహభాగం ఇచ్చారు. భారతదేశ రక్షణ, భారత దేశ సార్వభౌమాధికారం, రాజద్రోహానికి సంబంధించి వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛకు పరిమితులున్నాయి. అలానే..వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మన మాటలు పక్కనవారిని నొప్పించకూడదు. స్వేచ్ఛ ఉందని బట్టలు విప్పుకుని తిరుగుతామంటే కుదరదు. ఏదైనా సరే పరిధులు దాటకూడదు. ఈ విషయాన్ని మీడియా గుర్తు పెట్టుకుంటే మంచిది. దీనినే మీడియాలో లక్ష్మణ రేఖ అంటారు. రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌లో భాగంగానే మీడియాకు స్వేచ్ఛ.

బాబుకు బై చెప్పే కదా వైఎస్ జగన్‌ను స్వాగతించింది

ఒక వర్గం మీడియా పని గట్టుకుని వార్తలు వండి..బురద జల్లుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతల ఆరోపణ. కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడ వైఎస్ జగన్, ఆయన మంత్రులు, సలహాదారులు ఒక్క లాజిక్ మరిచిపోతున్నారు. ఏ మీడియా సపోర్ట్ ఉందని 2004లో వైఎస్ఆర్‌ సీఎం అయ్యారు. ప్రజలు వైఎస్ఆర్ ను సీఎంగా చూడాలనుకున్నారు..ఆ సీట్లో కూర్చోబెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షి తప్పితే ఎవరైనా సపోర్ట్ చేశారా?. కాని..151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌ సభ సీట్లు ఇచ్చి ప్రజలు వైఎస్ జగన్‌పై తమ నమ్మకం ఉందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడేలా చెప్పారు. బాబు పాలన చూశారు. పాదయాత్రలో జగన్ కష్టం చూశారు. జగన్ మాటలు నమ్మారు. చంద్రబాబు పాలనకు బై చెప్పారు.

టీడీపీ పాలనకు సపోర్ట్ చేసే ఛానళ్లు, పత్రికలు మాటలు వింటే..వైఎస్ఆర్‌ సీపీ అన్ని సీట్లు వచ్చేవా?. ప్రజలకు అన్నీ తెలుసు వారు టీవీలు చూస్తారు, పేపర్లు చదువుతారు. కాని ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ సలహాదారులు మరిచిపోతే ఎలా?!.

అవును..సాక్షి మీద, వారి పాత్రికేయుల మీద చంద్రబాబు కేసులు పెట్టించారు. వైఎస్ జగన్ మీద కోపంతో ఆనాటి ప్రభుత్వాలు సాక్షి మీద ఐటీ దాడులు కూడా చేయించాయి. ఈ దాడులు వెనుక చంద్రబాబు ఉన్నారని కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఆ సమయంలో నేను సాక్షిలో ఉద్యోగిని. ఆ సోదాలను నేను ప్రత్యక్షంగా చూశాను. నా ముందర సీపీయూలో హార్డ్ డిస్క్‌ తీసుకుపోయిన సంగతి నేను ఇంకా మరిచిపోలేదు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పత్రికలు, ఛానళ్లు జగన్ మీద అభిమానాన్ని అవగింజంత కూడా అడ్డుకోలేక పోయాయి. ప్రజలను నమ్ముకుని పాలన సాగిస్తే..రోత రాతల అడ్డుకోగలవా? . ఇక.. పత్రికల మీద పరిమితులు విధిస్తూ తెచ్చే ఫత్వాలు పాలకుల ఆలోచన ధోరణల్లో తేడా లేదని చెబుతున్నాయి. చంద్రబాబు చేసిన తప్పులనే వైఎస్ జగన్ చేస్తున్నారు. ఇక ఆయనకు ఈయనకు తేడా ఏముందీ?.

సలహాదారులా..?కలహాదారులా..?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. పాలక పక్షంలోని వచ్చాక ఒక రకంగా ఉంటాయి. పాలకులు జాగ్రత్తగా అడుగులు వేయాలి. సలహాదారులు కూడా విమర్శలకు దారి ఇవ్వని సలహాలు ఇవ్వాలి.

సీనియర్‌ పాత్రికేయులుగా, సంపాదకులుగా ఉండి పత్రికలపై జులుం విధిలించే జీవోలను మంచి సలహాలతో అడ్డుకోపోగా..సమర్ధించడం కచ్చితంగా దేనికి నిదర్శనం. వైఎస్ జగన్‌ను సలహాదారులు, కోటరీనే తప్పు దోవ పట్టిస్తున్నారని ప్రజలు, వైఎస్ఆర్‌ సీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. సీఎంగా వైఎస్ జగన్ దృష్టి పెట్టాల్సింది మాట ఇచ్చిన 'రాజన్న రాజ్యం'పై. ఇప్పటి వరకు వైఎస్ జగన్ పాలనలో ప్రతిపక్షాలకు సరైన అస్త్రం దొరకలేదు. ఒక్క ఇసుక తప్ప. ఈ సలహాదారులే ఇప్పుడు అధికార పక్షంపై దాడి చేయడానికి ప్రతిపక్షానికి జీవో 2430 రూపంలో ఓ అస్త్రం ఇచ్చారు. ఇలా అయితే...సలహాదారులు కాస్త కలహాదారులుగా మిగిలిపోతారు .

వ్తెఎస్ ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పత్రికలను కట్టడి చేయడానికి జీవో తేస్తే..దానిని వ్యతిరేకిస్తూ కె.రామచంద్రమూర్తి ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాయడం నాకు బాగా గుర్తుంది. ఇక..ఇప్పుడు దేవులపల్లి అమర్తెతే జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ధర్నాలు, ర్యాలీలే చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి కలానికి సంకెళ్లు వేయడానికి అమరావతిలో బుద్ధుడి సాక్షిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, సమర్ధించుకుంటున్నారు. ఆంధ్ర జ్యోతిలో ఉన్నా జర్నలిజమే చేయాలి, సాక్షిలో ఉన్నా జర్నలిజమే చేయాలి. సలహాదారులుగా ఉన్నా జర్నలిజం మూలాలు మరవకూడదు. ఎక్కడా పని చేయకుండా ఖాళీగా ఉన్నా జర్నలిస్ట్ జర్నలిస్ట్ గానే ఉండాలి. ప్రభుత్వాలు మారినట్లు ఆలోచనలు, విలువలు మారకూడదు.!

జర్నలిస్ట్‌ సంఘాలకు నిరసనలు ఇప్పుడే గుర్తొచ్చాయా?

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా పత్రికలపై ఆంక్షలు పెట్టారు. పత్రికలపై అనడం కంటే సాక్షిపై అనడం కరక్ట్‌గా ఉంటుంది. సాక్షిపై కక్ష గట్టి వేధిస్తుంటే..ఇప్పుడు నోరు విప్పుతున్న జర్నలిస్ట్‌లు ఎక్కడకి పోయారు. ఇప్పుడు ధర్నాలు చేస్తామంటున్న జర్నలిస్ట్‌లు ఎక్కడున్నారు. చంద్రబాబు తప్పు చేసినా, వైఎస్ జగన్ తప్పు చేసినా తప్పును తప్పుగానే చూడాలి. చంద్రబాబు జీవో ఇస్తే మాట్లాడని వారు..ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వారిని వారు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ పాలకులు, ప్రతిపక్షాలు ముఖ్యం కాదు. పాత్రికేయ వృత్తి ధర్మంతోపాటు, ప్రజాస్వామ్యం ముఖ్యం. ప్రజలకు, ప్రభుత్వానికి కలాలు వారధి కావాలి.

ఇక..జర్నలిస్ట్‌ల కలాల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్న జీవోపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి.పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండాలి. పాత్రికేయులు కూడా అక్కసుతో అక్షరాలు వండకూడదు. వాస్తవాలను వక్రీకరించకుండా రాయాలి.

పాలకులు, ప్రతిపక్షం, పాత్రికేయులు కలిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ.

వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story