పేషంట్‌కు ఇచ్చిన టాబ్లెట్‌లో పురుగులు.. ఎవ‌రిది ఈ నిర్ల‌క్ష్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2020 1:07 PM GMT
పేషంట్‌కు ఇచ్చిన టాబ్లెట్‌లో పురుగులు.. ఎవ‌రిది ఈ నిర్ల‌క్ష్యం

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఎంత‌టి నిర్ల‌క్ష్యం ఉందో ఈ ఘ‌ట‌న మ‌రోసారి తెలియ‌జేసింది. అడ‌విదేవుల‌ప‌ల్లి మండ‌లం బ‌ల్నేప‌ల్లి గ్రామానికి చెందిన దివ్య అనే మ‌హిళ న‌ల్ల‌గొండ మిర్యాలగూడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఈ నెల 24న ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలోని ప్ర‌సూతి వార్డులో ఉంది. డెలివరీ పేషంట్ల‌కు క్ల‌వ్ల‌నేట్ టాబ్లెట్స్ ఇస్తారు. దివ్య‌కు కూడా ఈ మాత్ర‌ల‌ను ఇచ్చారు.

కాగా.. ఈ రోజు టాబ్లెట్ ను వేసుకుందామ‌ని క‌వ‌ర్‌ను తీయ‌గా.. డ‌స్ట్ తో పాటు టాబ్లెట్స్ లో పురుగులు క‌నిపించాయి. దీంతో ఆమె భ‌య‌బాంత్రుల‌కు గురైంది. ఈ విష‌యాన్ని దివ్య తండ్రి ఆస్ప‌త్రి వారి దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాత్ర‌ల‌ను తాము త‌యారు చేయ‌మ‌ని, ఇంకా టాబ్లెట్స్‌కు ఎక్స్‌పైరీ డేట్ కూడా దాటిపోలేద‌ని వారు చెప్పిన‌ట్లు మీడియాకు తెలిపారు. వెంట‌నే వేరే టాబ్లెట్స్ ను ఇచ్చార‌న్నాడు. రాత్రి స‌మ‌యంలో ఆ మాత్ర‌ల‌ను వేసుకుంటే పేషంట్ ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించాడు. తాము పేద‌ల‌మ‌ని.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లే స్తోమ‌త త‌మ‌కు లేద‌న్నాడు. ఇప్ప‌టికైనా.. అధికారులు నిర్ల‌క్ష్యం వీడాల‌న్నారు.

Next Story