విశాఖలో వెలుగు చూసిన రెండో ప్రపంచ యుద్ధకాలపు స్థావరాలు
By రాణి Published on 15 Feb 2020 7:22 AM GMTవిశాఖపట్నం దసపల్లా కొండలపై ఉన్న సర్క్యూట్ హౌస్ ఇకపై రాష్ట్ర గవర్నర్ బంగళా కాబోతోంది. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న తుప్పలను, దుబ్బును తొలగించే పనిని అధికారులు చేపట్టారు. దానిని శుభ్రం చేస్తూంటే వారికి ఎండుగడ్డి మధ్య ఒకన్ని కాంక్రీట్ నిర్మాణాలు కనిపించాయి. ఆ గోడలు ఎంత గట్టిగా ఉన్నాయంటే అవి సమ్మెటపోట్లకు లొంగడం లేదు. చాలా దృఢంగా, బలంగా ఉన్నాయి. దాన్ని చూసి వాళ్లు కంగారు పడి అధికారులకు తెలియజేశారు. దాంతో పురాతన కట్టడాలను పరిరక్షించే ఇంటాక్ సంస్థ ప్రతినిధులు ఎడ్వర్డ్ పాల్, మయాంక్ దేవిలు అక్కడికి హుటాహుటిన వచ్చారు. దాన్ని చూడగానే వారికి ఆ కట్టడాలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వైమానిక దాడులను తప్పించుకునేందుకు నిర్మించిన కట్టడాలని అర్థమైంది. ఇలాంటి అయిదు కట్టడాలు బయటపడ్డాయి. ఇరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న నాలుగు నుంచి ఆరు గన్ బ్యాటరీలు అయి ఉంటాయని భావిస్తున్నారు.
ఈ నిర్మాణాలు బయటపడగానే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ విమానాలు దాడులు చేస్తాయన్న భయంతో ప్రజలు 1941 నుంచి 1945 వరకూ నిద్ర లేని రాత్రులు గడిపిన దృశ్యాలు పాతతరం వారి కళ్లముందు బొమ్మలు కట్టాయి. ఇంతకు ముందు ఆర్ కే బీచ్ వద్ద పిల్ బాక్సులు కూడా దొరికాయి. ఈ పిల్ బాక్సులు నార్మండీ లో చేసినట్టుగా శత్రువులు పడవల మీద వచ్చి ఒడ్డున దిగడానికి వీల్లేకుండా చేయడానికి ఉద్దేశించినది. తాజాగా వెలుగుచూసిన కట్టడాలు శత్రువుల పడవలపై దూరం నుంచి దాడి చేయడానికి ఉద్దేశించినవై ఉండవచ్చునని మాజీ సైనికాదికారి మాథ్యూ థామస్ అంటున్నారు.
రెండో ప్రపంచయుద్ధానికి ముందు విశాఖపట్నం రధానంగా జాలర్లు నివసించే ఒక చిన్నతీరప్రాంత గ్రామం. కానీ రెండో ప్రపంచయుద్ధ సమయంలో బర్మాకి సైన్యాన్ని, సామగ్రిని పంపేందుకు, సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను నిలువరించేందుకు గాను విశాఖను ఒక పట్టణంగా అభివద్ధి చేయడం జరిగింది. అప్పట్నుంచే విశాఖ ఒక ఓడరేవుగా, నగరంగా ఎదిగింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏప్రిల్ 6, 1942 నాడు అయిదు జపానీస్ యుద్ధ విమానాలు బంగాళాఖాతంలో ఉన్న యుద్ధ నౌకనుంచి బయలుదేరి విశాఖ హార్బర్ పై దాడులు చేశాయి. అవి పోర్టు పై మూడు బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో పోర్టులో ఒక కాంక్రీట్ పైప్ పాక్షికంగా దెబ్బతిన్నది. మరొక బాంబు థర్మల్ పవర్ స్టేషన్ పై పడింది. మూడవది సిమెంట్ స్టోరేజ్ హౌస్ పై పడింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఊరు వదిలి పారిపోయారు. వీరిలో చాలా మంది రెండో ప్రపంచయుద్ధం పూర్తయిన తరువాతే మళ్లీ వైజాగ్ కి తిరిగి వచ్చారు. ఆ తరువాత బ్రిటిష్ సైనికులు జపాన్ కు చెందిన ఒక జలాంతర్గామిని ధ్వంసం చేశారు. ఈ జలాంతర్గామి బ్రిటిష్ మిలటరీ సరఫరాలను దెబ్బతీయాలని ప్రయత్నించింది.