ఉప్ప‌ల్ 'ఉప్పెన‌'లో కొట్టుకుపోయిన రికార్డులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Dec 2019 8:55 AM GMT
ఉప్ప‌ల్ ఉప్పెన‌లో కొట్టుకుపోయిన రికార్డులు..!

నిన్న సాయంత్రం ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6×4, 6×6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5×4, 4×6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అయితే.. ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు న‌మోద‌య్యాయి.. అవేంటో చూద్దాం..

1. టీమిండియాకు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక లక్ష్యఛేదన (208). గతంలో శ్రీలంక (207)పై ఛేదించింది.

2. ఉప‌ఖండంలో జ‌రిగిన‌ అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాపై ఏ జ‌ట్టైనా అత్యధిక సిక్సర్లు (15) బాద‌డం ఇదే మొదటిసారి.

3. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్టు తీసిన చాహల్‌.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (52) తీసిన బౌలర్‌గా అశ్విన్‌తో కలిసి మొద‌టిస్థానంలో నిలిచాడు.

4. ఇండియాలో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌పై రెండో అత్యధిక స్కోరు (207)ను సాధించిన జట్టు విండీస్‌. అంత‌కుముందు శ్రీలంక (215) టాప్‌లో ఉంది.

5. దీపక్‌ చాహర్‌.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ నుండి అత్యధిక పరుగులు (56) సమర్పించుకున్న మూడో బౌలర్ గా నిలిచాడు. అత‌నికంటే ముందు యజ్వేంద్ర చాహల్‌ (64), జోగిందర్‌ శర్మ (57) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

6. లోకేష్ రాహుల్.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ (29)ల‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా ఫించ్‌తో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. బాబర్‌ ఆజమ్‌ (26), కోహ్లీ (27) టాప్‌-2లో ఉన్నారు.

7. విరాట్‌ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ హాఫ్‌ సెంచరీ (23)లు సాధించిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ను అధిగమించాడు. అంతేకాకుండా 12 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డుల‌తో మహ్మద్‌ నబీతో కలిసి విరాట్‌ తొలి స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Next Story