2019లో భూమి 'బుర్ర' వేడెక్కింది... తక్షణమే చల్లబరచండి..!

By అంజి  Published on  4 Dec 2019 9:48 AM GMT
2019లో భూమి బుర్ర వేడెక్కింది... తక్షణమే చల్లబరచండి..!

ముఖ్యాంశాలు

  • 2019 లో మామూలు కన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు
  • నివేదిక విడుదల చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ

2019 మాంఛి వేడి మీదుంది. అవును. ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాల్లో ఒకటి. మామూలుకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉందని ఈ సారి గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివరాలన్నీ ప్రపంచ వాతావరణ సంస్థ జారీ చేసిన తాత్కాలిక నివేదిక ద్వారా వెల్లడయ్యాయి. ఈ నివేదికను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో భాగంగా విడుదల చేశారు.

2019 లో మామూలు కన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి సంఘటనలు పలు చోట్ల జరిగాయి. ఇందులో జూన్ 10 న ఢిల్లీ విమానాశ్రయంలో నమోదైన 48 డిగ్రీల సెల్సియన్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పారిశ్రామిక విప్లవ కాలానికి ముందు (1850-1900) ఉన్న ఉష్ణోగ్రతల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అని నివేదిక తెలియచేసింది.

అయితే 2016 నాటి ఉష్ణోగ్రతలను ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధిగమించలేకపోయాయి. 2016 ఇప్పటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం. 2019 రెండో లేదా మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది. అయితే పలు దేశాల్లో 2019 లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదాహరణకు ఫ్రాన్స్ లో ఈ ఏడాది నమోదైన 46 శాతం ఉష్ణోగ్రత ఒక రికార్డు. అంత వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీలు ఎక్కువ. జర్మనీ (42.6 డిగ్రీలు), నెదర్లాండ్స్ (41 శాతం), బెల్జియం (42) లగ్జెంబర్గ్ ( 41) యూకే (39 డిగ్రీలు) తమ తమ దేశాల్లోనే అత్యధిక టెంపరేచర్ ను నమోదు చేశాయి.

ఈ ఏడాది గ్లోబల్ వార్మింగ్, హిమానీనదాల మంచు కరగడం, సముద్ర మట్టం తగ్గుదల వంటివి నమోదయ్యాయి. వీటికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ గ్యాస్ ల విడుదల పెరగడం. నివేదిక ప్రపంచం తన కార్బన్ డిపాజిట్లను కరిగించివేయడం పట్ల ఆందోళనను వ్యక్తం చేసింది. 2018 లో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 407.8 పీపీఎం ఉండగా, ఈ ఏడాది అది మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే కార్బన్ డయాక్సౌడ్ పరిమాణం 450 పీపీఎం కి తక్కువగా ఉండాలి. 1750 లో 277 పీపీఎం ఉన్న కార్బన్ డయాక్సైడ్ 2017 నాటికి 405 పీ పీ ఎం కి చేరుకుంది. గతేడాది ఇది 407.8 కి చేరుకుంది. ఈ ఏడాది ఇది 410 పీపీఎం కి చేరుతుందని, ఇదే వేగంతో కొనసాగితే ఏ శతాబ్దాంతానికి 3 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదిక హెచ్చరించింది.



Next Story