తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేవు. రవాణా కష్టం. అలాంటి చోట్ల ఉన్న ప్రజలకు జబ్బు చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టం. తీసుకెళ్లినా మందులు కావాలంటే తేవడం కష్టం. ఇలాంటి మారుమూల ప్రాంతాలకు వైద్యసేవలు అందించడం ఎలా? వారికి అత్యవసరమైన సమయంలో అవసరమైన మందులు ఎలా అందించాలి?

ఇదిగో సరిగ్గా ఇప్పుడే మన ప్రభుత్వానికి ఆంజనేయుడు గుర్తుకొచ్చాడు. రామరావణ యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని మూలిక అవసరం వచ్చింది. అప్పుడు ఆంజనేయుడు ఆకాశ మార్గాన వెళ్ళి సంజీవనిని తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఈ మారుమూల ప్రాంతాల వారికి మందులు అందించేందుకు మన ప్రభుత్వం ఆంజనేయుడి ఫార్ములానే అనుసరిస్తోంది. డ్రోన్ల సాయంతో అవసరమైన మందులు అందించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల విభాగం పూనుకుంటోంది. ఇదే పూర్తిగా అమలైతే ఊళ్లలో అనారోగ్యం పాలైన ప్రతి లక్ష్మణరావుకీ డ్రోన్లే ఆంజనేయుళ్లవుతాయి.

అసలీ పథకాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తొలిసారి ఆఫ్రికన్ దేశం రువాండాలో ప్రారంభించింది. దాదాపు నాలుగు గంటలు పట్టే సమయాన్ని డ్రోన్ల సాయంతో కేవలం పదిహేను నిమిషాలకు తగ్గించడం జరిగింది. ఎన్నో వేల ప్రాణాలను కాపాడటం జరిగింది. ఇప్పుడిదే పథకం మన తెలంగాణలో అమలు కానుంది. అయితే మార్చి నెలలో డ్రోన్లు మందులను ఇంత దూరం తీసుకెళ్లగలవని నిరూపించాల్సి ఉంది. ఈ ప్రయోగం బేగంపేట్ ఎయిర్ పోర్టులో జరుగుతుంది. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం, పౌరవిమానయాన శాఖ, రాష్ట్ర వైద్య, సమాచార సాంకేతికత విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు.

తరువాత వివిధ జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్కడ నుంచి డ్రోన్ల సాయంతో మందులను సుదూర ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కించేందుకు అవసరమైన రక్తం, పాము, తేళ్ల వంటి విషజంతువుల కాటుకు విరుగుడు మందులు, వైద్యపరీక్షల సాంపిళ్లు, వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా పంపడం జరుగుతుంది. ఇప్పటికే పలు డ్రోన్ల సంస్థలు ఈ ప్రతిపాదనల పట్ల ఆసక్తిని చూపిస్తున్నాయి. అయితే డ్రోన్ల విషయంలో పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కొన్ని నిబంధనలను విధించారు. డ్రోన్లు ఖచ్చితంగా ప్రయాణ సమయంలో కళ్లకు కనిపించాలి.కాబట్టి అవి ఎక్కువ ఎత్తుకు వెళ్లలేవు. ఈ నిబంధన నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు కోరుతోంది. ఈ అనుమతి లభిస్తే ప్రతి డ్రోనూ ఒక ఆంజనేయుడే.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.