వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తక్కువ స్కోరుకు ఆలౌట్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 12:33 PM GMTవరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తక్కువ స్కోరుకు ఆలౌట్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఒక్కసారి కూడా ఆలౌట్ కాని భారత్.. ఫైనల్‌లో మాత్రం అన్ని వికెట్లు పడ్డాయి. అయితే.. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ (66), కోహ్లీ (54), రోహిత్ శర్మ (47), సూర్యకుమార్ (18) పరుగులు చేశారు. ఇక స్టార్క్‌కు మూడు వికెట్లు పడగా.. కమ్మిన్స్, హేజిల్‌వుడ్‌కు చెరో రెండు వికెట్లు పడ్డాయి. జంపా, మాక్స్‌వెల్ కూడా చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 241 పరుగులు.
అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అందుకు అనుగుణంగానే మంచి బౌలింగ్ చేస్తూ.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. మరోవైపు భారత్‌కు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (4) పరుగులకే ఔట్ అయినా.. రోహిత్, విరాట్ కలిసి 9 ఓవర్లకే 70 పరుగులు చేశారు. దాంతో.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు దిశగా వెళ్తున్నట్లు అనిపించింది. తొలి పది ఓవర్లలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ కూడా బాగా చేసింది. చాలా వరకు బౌండరీలను ఆపగలిగింది. ఇక రోహిత్ శర్మ వికెట్ పడ్డ తర్వాత శ్రేయాస్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయ్యర్ కూడా తొందరగా పెవిలియన్‌కు చేరడంతో ఒత్తిడి పెరిగినట్లు అయ్యింది. దాంతో.. విరాట్-కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. దాదాపు 97 బంతుల వరకు బౌండరీ చేయలేకపోయారు. దాంతోనే అర్థమవుతోంది బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎలా రాణించారనేది. విరాట్, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగులు జోడించారు. విరాట్ హాఫ్ సెంచరీ తర్వాత అనుకోకుండా కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత సూర్యకుమార్‌ను రాకుండా జడేజాను పంపింది టీమ్. కానీ.. జడేజా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మరోవైపు క్రీజు చాలా సేపటి నుంచి ఉన్న కేఎల్‌ను స్టార్క్ ఔట్ చశాడు. షమీ కూడా బ్యాట్‌ను ఝుళిపించే ప్రయత్నంలో వికెట్ కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. బుమ్రా ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. చివరలో మెరుపు షాట్స్ ఆడతాడని అనుకున్నా సూర్య కూడా గ్లౌజ్ తగిలి కీపర్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. చివరిలో కుల్ దీప్ యాదవ్ 10(18) పరుగులు చేసి రనౌట్ అవ్వగా, మహ్మద్ సిరాజ్ 9(8) నాటౌట్‌గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కేవలం 13 ఫోర్లు, మూడు సిక్స్‌లు మాత్రమే నమోదు చేసింది.
కాగా.. ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా 229 పరుగులే చేసింది. అయినా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో 129 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. మరి ఇది ఫైనల్ కావడం.. ఆస్ట్రేలియా కూడా ఫామ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బౌలర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.