జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై హెడ్ కోచ్ ద్రవిడ్ వివరణ
ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికకు గల కారణాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించాడు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 6:51 AM GMTజట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై హెడ్ కోచ్ ద్రవిడ్ వివరణ
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన తొలి టీమ్‌గా నిలిచింది భారత్. జోరుమీద ఉన్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల గాయడపడి దూరమయ్యారు. అతడు సెమీస్ వరకు కోలుకుని కీలక మ్యాచుల్లో ఆడతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. గాయం ఇంకా తగ్గకపోవడంతో అతడు వరల్డ్ కప్ టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
అయితే.. అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. అతడి ఎంపికకు గల కారణాలను వివరించాడు. టీమ్‌ఇండియా పేస్ బౌలింగ్ వనరులను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
హార్దిక్ ప్లేస్‌లో ప్రసిద్ధ్‌ను తీసుకోవడం మంచి ఆలోచన అని చెప్పాడు రాహుల్ ద్రవిడ్. ఇప్పటికే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌లోఆడామని.. 15 మందితో కూడిన జట్టులో స్పిన్ బ్యాకప్‌లో (అశ్విన్ ) ఉన్నట్లు చెప్పాడు. అలాగే ఆల్ రౌండర్ (శార్దూల్) బ్యాకప్ కూడా ఉన్నట్లు చెప్పాడు. కానీ.. ఫాస్ట్ బౌలింగ్‌కు బ్యాకప్ లేదని చెప్పాడు ద్రవిడ్. ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా.. గాయపడినా అందుకోసం బ్యాకప్ అవసరమని భావించామని చెప్పాడు. అందుకే ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు టీమిండియాకు ఇది ఉపయోగపడుతుందని భారత జట్టు హెడ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19న టీమిండియా మ్యాచ్ పుణె వేదికగా జరిగింది. బౌలింగ్ చేస్తూ బ్యాటర్ కొట్టిన బంతిని ఆపబోయి హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఓవర్ కూడా పూర్తి చేయడకుండానే పెవిలియన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత మిగతా మూడు బాల్స్‌ని కోహ్లీ వేసి పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అనుకున్నా చివరకు గాయం నుంచి కోలుకోని హార్దిక్ పూర్తి వన్డే వరల్డ్ కప్ టోర్నీకి దూరం అయ్యాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకూ 17 వన్డేలు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడాడు.