ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన శ్రీలంక, 8 వికెట్ల తేడాతో పరాభవం
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 8:30 PM IST
ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన శ్రీలంక, 8 వికెట్ల తేడాతో పరాభవం
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఖాతాలో నాలుగో పరాజయం చేరింది. ఈ టోర్నీకి ముందు అత్యంత బలంగా కనిపించిన ఇంగ్లండ్‌కు ఓటములు అలవాటైనట్లుగా అనిపిస్తోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్ బృందాన్ని.. మ్యాచ్‌లో శ్రీలంక మట్టికరిపించింది. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 25.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 77, సదీర సమరవిక్రమ 65 పరుగులతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓ దశలో శ్రీలంక 23 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా (4), కెప్టెన్ కుశాల్ మెండిస్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే, నిస్సాంక, సమరవిక్రమ ఇద్దరూ బాగా రాణించారు. మరో వికెట్ పడకుండా అజేయంగా శ్రీలంకను గెలుపు తీరాలకు చేర్చారు. 25.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. లాహిరు కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
శ్రీలంకతో మ్యాచ్‌లో పరాజయంతో ఇంగ్లండ్ సెమీస్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. గత వరల్డ్‌కప్‌లో సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి కనీసం టాప్-4లో కూడా చేరకుండా నిష్క్రమించే దుస్థితికి చేరువైంది. ఇక ఈ విజయంతో శ్రీలంక సెమీస్ అవకాశాలను కొద్ది మేర మెరుగుపర్చుకుంది. 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన ఇంగ్లండ్ నాలుగింటిల్లో ఓటమిపాలైంది. రెండు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.