World cup: కొత్త రికార్డు నమోదు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 4:11 PM ISTWorld cup: కొత్త రికార్డు నమోదు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కప్ కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడుతున్నాయి. అయితే..ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో కెప్టెన్‌గా ఉండి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2019 ప్రపంచ కప్‌లో కేన్ విలియమ్సన్ సాధించిన 578 పరుగుల రికార్డును.. ఇవాళ్టి మ్యాచ్‌లో 29వ పరుగుల వద్ద రోహిత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అవే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు.. సిక్సర్లతో మంచి ఓపెనింగ్స్ అందించాడు. 47 పరుగులు చేసి ఔట్ అయిన రోహిత్ శర్మ.. ఈ టోర్నీలో మొత్తం 597 పరుగులు చేశాడు.
ఇదొక్కటే కాదు కెప్టెన్ రోహిత్ శర్మ మరికొన్ని రికార్డులను బ్రేక్ చేశారు. ఒక ప్రపంచ కప్ టోర్నీలో తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్. ఈ టోర్నీలో 10 ఓవర్ల లోపు మొత్తం 354 పరుగులు చేయగా.. ఫైనల్‌లో చేసిన 47 పరుగులతో అవి మొత్తం 401కి చేరింది. గతంలో ఈ రికార్డు 2015లో న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కల్లం (308 పరుగులు) పేరు మీద ఉండేది.
రోహిత్ శర్మ సొంత స్కోరు బోర్డు చూసుకోలేదు.. దాదాపు ఐదు సార్లు నలభై పరుగుల మీదే ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీలు చేసే అవకాశాలు ఉన్నా అవేవి పట్టించుకోలేదు. ఆరంభం అదిరిపోయేలా ఉండాలని చెలరేగి ఆడాడు రోహిత్. అయితే.. వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరాడు. మొత్తం 28 ఇన్నింగ్సుల్లో 1575 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు ఈ జాబితాలో సచిన్ (2278), కోహ్లీ (1752), పాంటింగ్ (1743) మాత్రమే ఉన్నారు. హిట్‌మ్యాన్ తర్వాత ప్రస్తుతం వార్నర్ 1,520 పరుగులతో అతిదగ్గరగా ఉన్నాడు. అంతేకాదు.. ఈ టోర్నలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. మొత్తం 11 మ్యాచుల్లో 31 సిక్స్‌లను బాదాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.