World Cup-2023: విరాట్‌ సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on  19 Oct 2023 9:37 PM IST
world cup-2023, india, bangladesh,

World Cup-2023: విరాట్‌ సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా ఈజీగానే టార్గెట్‌ను చేధించింది. లక్ష్యాన్ని 41.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. ఛేదనలో విరాట్‌ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్‌, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధించాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (40 బంతుల్లో 48, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో కెఎల్‌ రాహుల్‌ (34 బంతుల్లో 34 నాటౌట్‌, 3 ఫోర్లు, 1సిక్సర్‌) రాణించడంతో భారత్‌ ఈజీ విక్టరీ కొట్టింది. వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఇప్పటి వరకు 4 మ్యాచులు ఆడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. కాగా బంగ్లాదేశ్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లోని ఓటమిని చవిచూసింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ లు తొలి వికెట్‌ కు 12.4 ఓవర్లలో 88 పరుగులు జోడించారు. ఈ ఇరువురూ కలిసి తొలి పవర్‌ ప్లేలోనే భారత్‌ను విజయం దిశగా నడిపించారు. రోహిత్‌ తృటిలో అర్థ సెంచరీ కోల్పోయినా.. 52 బంతుల్లో గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. వన్డే ప్రపంచకప్‌లో గిల్‌కు ఇదే తొలి అర్థ సెంచరీ కావడం విశేషం. రోహిత్ ఔట్‌ అయ్యాక విరాట్‌ కోహ్లీ కూడా అదే దూకుడును కొనసాగించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లోనే 4, 6 బాది తన ఉద్దేశాన్ని చాటిన కోహ్లీ.. 48 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 19, 2 ఫోర్లు)ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయాస్‌ను మెహిది హసన్‌ మిరాజ్‌ ఔట్‌ చేశాడు.

శ్రేయాస్ తర్వాత కెఎల్‌ రాహుల్‌తో కలిసి కోహ్లీ భారత్‌ను విజయం దిశగా నడిపించాడు. చివర్లో భారత్‌ విజయం కంటే కూడా కోహ్లీ శతకం చేస్తాడా..? లేదా..? అని ప్రేక్షకులంతా ఆతృతగా చూశారు. చివరకు కేఎల్‌ రాహుల్‌ సహకరించడంతో స్ట్రైక్‌ తనదగ్గరే పెట్టుకున్న విరాట్‌ కోహ్లీ సెంచరీ బాదేశాడు. కాగా వన్డే వరల్డ్‌ కప్-2023 పాయింట్స్‌ టేబుల్‌లో తొలిస్థానంలో న్యూజిలాండ్‌ ఉండగా.. రెండోస్థానంలో భారత్‌ ఉంది.

Next Story