world cup-2023: అదరగొట్టిన భారత్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో టీమిండియా తలపడుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 12:48 PM GMTworld cup-2023: అదరగొట్టిన భారత్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో టీమిండియా తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది శ్రీలంక. అయితే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీగా పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. అయితే.. భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచినా ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు. గిల్ జస్ట్ మిస్ అయ్యాడు 92 బంతుల్లో 92 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక విరాట్ కూడా 94 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత మెరుపు షాట్స్ ఆడిన శ్రేయాస్ కూడా శతకం చేస్తాడని అనుకున్నారు అంతా. కానీ.. అతడు 56 బంతుల్లో 82 పరుగులు తీసి పెవిలియన్‌కు చేరాడు. కానీ.. టీమ్‌కు మాత్రం మంచి స్కోర్ లభించినట్లు అయ్యింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు తీసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తాకింది. ఫస్ట్ బాల్‌కే బౌండరీ బాదిన కెప్టెన్ హిట్‌మ్యాన్.. మధుశంక వేసిన రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ ఆరంభాన్ని లంక సద్వినియోగం చేసుకోలేదు. వన్ డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీతో పాటు గిల్ భారత స్కోరుబోర్డును నడిపించారు. లంక బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా గిల్, కోహ్లీ ధాటిగా ఆడారు. రన్ రేట్ 6కు పడిపోకుండా రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించారు. అయితే సెంచరీలకు చేరువవుతున్న క్రమంలో మధుశంక భారత్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 30వ ఓవర్లో గిల్‌ను ఔట్ చేసిన మధుశంక.. అతడే వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీని కూడా పెవిలియన్‌కు పంపాడు.
ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన అతడిపై వేటు తప్పదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అయ్యర్ బ్యాట్ ఝుళిపించాడు. కసున్ రజిత వేసిన 36వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అయ్యర్.. తీక్షణ వేసిన 41వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. మధుశంక వేసిన 48వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఇక అదే ఓవర్లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి తీక్షణ చేతికి చిక్కాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా మెరుపు షాట్స్ ఆడటంతో 357 పరుగులు సాధించింది. ఇక వరల్డ్ కప్-2023లో భారీ సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గా శ్రేయాస్ నిలిచాడు. 106 మీటర్ల సిక్స్ కొట్టాడు.