ముంబైలో జట్టుతో కలవనున్న పాండ్యా..శ్రీలంక మ్యాచ్‌లో ఆడతాడా..?

పాండ్యా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  30 Oct 2023 4:20 PM IST
world cup-2023, hardik,  team india,

 ముంబైలో జట్టుతో కలవనున్న పాండ్యా..శ్రీలంక మ్యాచ్‌లో ఆడతాడా..?

వన్డే వరల్డ్‌ కప్-2023లో వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడం.. అదీకాక అన్ని మ్యాచుల్లో ఘనవిజయాలు సాధిస్తుండటంతో అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియాకు మరో గుడ్‌న్యూస్‌ అందుతోంది. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ జరుగుతుండగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. అయితే.. పాండ్యా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. అయితే.. నవంబర్ 2వ తేదీన టీమిండియా ముంబై వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ నాటికి హార్దిక్‌ పాండ్యా ముంబైలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు.. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆ లోపు టీమిండియా మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమిండియా నెక్ట్స్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒక్క సౌతాఫ్రికా మాత్రమే కఠినమైన ప్రత్యర్థి.

అయితే.. నవంబర్ 2న జరగబోయే శ్రీలంక మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యాను ఆడించేది కష్టమే అని తెలుస్తోంది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న పాండ్యా ఇంకా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రీహాబిటేషన్‌ పొందుతున్నాడు. అంత ముఖ్యమైన మ్యాచ్‌లు కాకపోవడంతో.. హార్దిక్‌ను తీసుకుని తిరిగి గాయాన్ని పెద్దది చేయడం కంటే సెమీస్ వరకు విరామం ఇవ్వడమే బెటర్‌ అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక ఇదే విషయంపై మాట్లాడిన బీసీసీఐ ప్రతినిధి ఒకరు.. ప్రస్తుతం పాండ్యా ఎన్‌సీఏలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో ముంబైలో టీమిండియాతో కలుస్తాడని చెప్పారు. అయితే..శ్రీలంకతో మ్యాచ్‌లో ఆడతాడని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జట్టుతో మాత్రం ముందుకు కొనసాగుతాడని చెప్పారు.

Next Story