వరల్డ్ కప్ ఫైనల్‌లో సిరాజ్ ఉండడా..? ఎవరిని తీసుకుంటారు..?
వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023 ఫైనల్ మ్యాచ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 6:45 PM ISTవరల్డ్ కప్ ఫైనల్‌లో సిరాజ్ ఉండడా..? ఎవరిని తీసుకుంటారు..?
వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023 ఫైనల్ మ్యాచ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పోరు కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ హైటెన్షన్ మ్యాచ్ మొదలు అవుతుంది. భారత్ గడ్డపై జరుగుతోన్న టోర్నీ కావడం.. ఇప్పటిదాకా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు రావడం భారత్‌కు శుభసూచకాలుగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా కప్పు కొట్టి చరిత్రను తిరగరాయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌లో గెలవాలని అంతే పట్టుదలతో ఉంది.
ఇప్పటికే రెండు టీమ్‌లు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాయి. తుదిపోరులో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా ఇదే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. దాంతో.. అతన్ని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దీనికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.. రవిచంద్రన్ అశ్విన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. లీగ్ దశలో చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో తను అద్భుతంగా బౌలింగ్ చేశారు. 8 ఓవర్లు వేసి.. 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దాంతో.. మరోసారి అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు అశ్విన్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దాంతో.. అతడు ఫైనల్ మ్యాచ్‌లో ఆడటం ఖాయమని అనిపిస్తోంది.
వరల్డ్ కప్ ఫైనల్ టీమిండియా తుది జట్టు (అంచనా): రోహిత్ (కెప్టెన్), గిల్, విరాట్, శ్రేయస్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్, అశ్విన్