ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌ను పరిశీలించిన ఆసీస్‌ కెప్టెన్, ఏమన్నాడంటే..

ఆదివారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 3:36 PM IST
world cup-2023, final match, india, australia, pat cummins,

ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌ను పరిశీలించిన ఆసీస్‌ కెప్టెన్, ఏమన్నాడంటే..




ఆదివారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో బలంగా ఉన్న భారత్‌ కప్పు కొట్టాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా కూడా భారత్‌ గడ్డపై టీమిండియాను ఓడించి కప్‌ కొట్టేయాలని భావిస్తోంది. అయితే.. ఇరు టీమ్‌లు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి.

ఇప్పటికే పిచ్ ఎలా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెచ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిశీలించారు. రోహిత్‌ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌ కృష్ణ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే అహ్మదాబాద్ గ్రౌండ్ కి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు రోహిత్‌ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్‌ భౌమిక్‌, తపోష్‌ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్‌ జయేశ్‌ పటేల్‌తో కాసేపు మాట్లాడారు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమ్మిన్స్‌ పిచ్‌ను పరిశీలించాడు. ఆ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ బాగుందనీ.. ఇది ఇంతకుముందు ఉపయోగించిన పిల్‌చా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బహుశా ఈ పిచ్‌పై వరల్డ్‌ కప్‌లో ఓ మ్యాచ్‌ జరిగి ఉంటుందని భావిస్తున్నా అని చెప్పాడు. పిచ్‌ ఎలాంటి స్వభావం కలిగి ఉందో చెప్పేంత నిపుణుడిని కాదని అన్నాడు. తన వరకు అయితే పిచ్‌ బాగానే ఉన్నట్లు కనిపించిందని పాట్‌ కమ్మిన్స్ చెప్పాడు. తాను పిచ్‌ వద్దకు వెళ్లినప్పుడు గ్రౌండ్‌ సిబ్బంది నీళ్లతో తడిపి ఉంచారనీ.. మరో 24 గంటలు గడిచాక మరోసారి పరిశీలిస్తే ఏంటనేది చెప్పగలమని పాట్ కమ్మిన్స్ అన్నాడు.

Next Story