జీర్ణించుకోవడం కష్టంగా ఉంది..నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్దిక్

వరల్డ్‌ కప్‌కు దూరం కావడంపై హార్దిక్‌ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 2:15 PM IST
team india, cricketer, hardik, emotional post ,

జీర్ణించుకోవడం కష్టంగా ఉంది..నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్దిక్

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ వరుస విజయాలను అందుకుని సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకున్న తొలి జట్టు భారత్. అయితే.. సెమీస్‌లో అడుగుపెట్టిన ఆనందంలో ఉండగానే టీమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయంతో బాధపడుతూ టీమ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్‌ కప్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. దాంతో.. టీమిండియా అభిమానులకు చేదువార్తగా మిగిలింది. అయితే.. ఇప్పటి వరకు అంటే ఓకే కానీ.. సెమీస్‌ నుంచి జరిగే మ్యాచుల్లో హార్దిక్‌ వంటి ఆల్‌రౌండర్‌ ఆటగాడు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. తాను వరల్డ్‌ కప్‌కు దూరం కావడంపై హార్దిక్‌ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు.

కష్టకాలంలో తనపై ప్రేమ చూపించి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హార్దిక్ పాండ్యా. వరల్డ్‌ కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు. ఇది తనకు చాలా కష్టంగా ఉందని అన్నాడు. జట్టుకు దూరంగా ఉన్నా.. తన మనసంతా టీమ్‌ దగ్గరే ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు.. ప్రతి మ్యాచ్‌.. ప్రతి బాల్‌.. ప్రతి చోటా జట్టును చీర్‌ చేస్తూ అక్కడే తిరుగుతూ ఉంటుందని హార్దిక్‌ పాండ్యా భావోద్వేగ పోస్టు పెట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

కాగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా చీలమండకు గాయమైన విషయం తెలిసిందే. అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. సెమీస్‌ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ.. గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ మధ్యలోనే అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాండ్యా స్థానంలో కర్ణాటక బౌలర్‌, టీమిండియా యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చాడు.

ఇక ప్రస్తుతం ఉన్న టీమిండియా ఎంతో ప్రత్యేక మైనది అని చెప్పాడు పాండ్యా. ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని.. ఆ నమ్మకం తనకుందన్నాడు. స్వదేశంలో మరోసారి టీమిండియా ట్రోఫీ గెలవడం ఖాయమన్నాడు.

Next Story