వరల్డ్ కప్-2023 పూర్తి టోర్నీకి టీమిండియా ఆల్‌రౌండర్ దూరం
టీమిండియాకు వరల్డ్ కప్‌లో షాక్ ఎదురైంది. టోర్నీ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ నిష్క్రమించాడు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 10:30 AM IST
వరల్డ్ కప్-2023 పూర్తి టోర్నీకి టీమిండియా ఆల్‌రౌండర్ దూరం
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ సెమీస్ చేరుకుందన్న సంతోషంలో ఉన్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, వైఎస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే.. ఆ గాయం నుంచి అతడు కోలుకోకపోవడంతో మెగా ఈవెంట్ నుంచి హార్దిక్ పాండ్యా పూర్తిగా నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా స్థానాన్ని బీసీసీఐ యువ పేసర్ ప్రసిద్ కృష్ణతో భర్తీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
కాగా ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి కింద పడిపోయాడు. దాంతో.. పాండ్యా కాలికి గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే క్రీజును వీడగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాండ్యా స్థానంలో బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను కోహ్లీ వేశాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాండ్యా మళ్లీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. స్కానింగ్ చేసిన తర్వాత పాండ్యాకు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అవుతాడని బీసీసీఐ వెల్లడించింది. పూర్తిగా కోలుకోని కారణంగా సెమీస్ చేరాలంటే కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. అయితే, టీమిండియా అద్బుత ప్రదర్శనతో 302 పరుగుల భారీ విజయంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఊహించని రీతిలో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణను అదృష్టం వరించింది. సొంతగడ్డ మీద తొలిసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భాగమయ్యే అవకాశం దక్కింది.తదుపరి.. లీగ్ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ సేవలు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
India's star all-rounder to miss the remainder of #CWC23.Details 👇https://t.co/oE1Fh9e5hG
— ICC (@ICC) November 4, 2023