కోహ్లీ సెంచ‌రీ మిస్‌.. అయినా భార‌త్ విజ‌యం సాధించింది..!

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయ ప‌రంప‌ర‌ కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  23 Oct 2023 6:46 AM IST
కోహ్లీ సెంచ‌రీ మిస్‌.. అయినా భార‌త్ విజ‌యం సాధించింది..!

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయ ప‌రంప‌ర‌ కొనసాగుతోంది. టోర్నీలో 21వ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం ధర్మశాలలో జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మరోసారి అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ(95) అద్భుతమైన ఇన్నింగ్సు ఆడాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. వీరితో పాటు శుభ్‌మన్ గిల్(26), శ్రేయాస్ అయ్యర్(33), కేఎల్ రాహుల్(27) కూడా శుభారంభం అందించినా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌టంలో విఫలమయ్యారు. గాయపడిన పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫ‌ల‌మ‌య్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. జడేజా అజేయంగా 39 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్‌ల‌లో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.

అంతకుముందు ధర్మశాలలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 273 పరుగులకు ఆలౌటైంది. కివీ జట్టు నుంచి డారిల్ మిచెల్(130) అద్భుత‌మైన సెంచ‌రీ చేశాడు. రచిన్ రవీంద్ర కూడా 87 బంతుల్లో 75 పరుగులు చేసి అత‌డికి తోడ్పాటు అంధించాడు. భార‌త‌ బౌలర్ల‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు ప‌గ‌గొట్టాడు. అలాగే.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీయగలిగారు.

Next Story