బంతి స్వింగ్ అవ్వకపోతే అదే పని చేస్తా: మహ్మద్ షమీ
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు భారత్ సత్తా చాటుతూ వచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 5:30 PM ISTబంతి స్వింగ్ అవ్వకపోతే అదే పని చేస్తా: మహ్మద్ షమీ
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు భారత్ సత్తా చాటుతూ వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చూడని టీమ్‌గా నిలిచింది. ఇప్పుడు ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలబడబోతుంది. ఈ సారి భారత జట్టు అన్ని విధాలుగా బలంగా ఉంది. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్.. ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా కనిపించింది. చివరి రెండు మ్యాచుల్లో చిన్నచిన్న మిస్‌క్యాచ్‌లు.. ఎక్స్‌ట్రాలు మినహాయిస్తే టీమిండియా స్ట్రాంగ్‌గా ఉంది. లీగ్ దశలో ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతే విజయం సాధించింది. మరోసారి ఆ టీమ్‌ను ఫైనల్‌లో ఓడించి సొంతగడ్డపై జరుగున్న టోర్నీలో కప్ గెలవాలని బావిస్తోంది. ఈ క్రమంలో అభిమానులు కూడా ఇండియా కప్ గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అయితే.. ఈ వరల్డ్ కప్‌లో ఒకరి గురించి మాట్లాడాలంటే మాత్రం.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ఇతను మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత జట్టులోకి వచ్చి తన పవర్ ఏంటో చూపించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమైన తర్వాత ఎంట్రీ ఇచ్చాడు ఈ పేస్ బౌలర్. అతను బంతి అందుకుంటే చాలు బ్యాటర్లు తడబడిపోతున్నారు. వికెట్లు సమర్పించుకుంటున్నారు. అలా వేస్తున్నాడు బౌలింగ్. మంచి స్వింగ్‌తో అద్భుత ప్రదర్శనను ఇస్తున్నాడు. ఇప్పటికే 6 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్-2023 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్‌లో అయితే న్యూజిలాండ్‌పై 7 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలుపుకొన్నాడు. అభిమానులు ఆ మ్యాచ్‌ను సెమీఫైనల్ కాదు.. అది షమీఫైనల్ అని చెప్పుకుంటున్నారు.
2023 వరల్డ్ కప్ లో తన బౌలింగ్ ప్రదర్శన అమోఘమైన రీతిలో సాగుతుండడం పట్ల షమీ స్పందించాడు. మొదట పిచ్ ఎలా స్పందిస్తుందో అని పరిశీలిస్తానని షమీ చెప్పాడు. బంతి స్వింగ్ అవుతుందా? లేదా అన్నది చూసుకుంటా అన్నాడు. ఒక వేళ బంతి స్వింగ్ కాకపోతే మాత్రం స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని మహ్మద్ షమీ చెప్పాడు. స్వింగ్ లేనప్పుడు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తానన్నాడు. దాంతో.. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే వీలుంటుందని.. తద్వారా వికెట్స్ పడతాయన్నాడు. బ్యాటర్లను డ్రైవ్ చేసేలా పురిగొల్పేందుకు ఓ ప్రత్యేకమైన జోన్ లో బంతిని పిచ్ చేస్తాననీ.. అలా వారు క్యాచ్‌లు ఇచ్చేస్తుంటారని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనా ఫైనల్‌లో కూడా ఇలాగే రాణించి కప్ కొట్టాలని టీమిండియా అభిమానులంతా కోరుకుంటున్నారు.