ఐదు వికెట్ల ప్రదర్శన వెనక రహస్యం చెప్పిన షమీ..!
ప్రపంచకప్-2023లో ఆదివారం తన తొలి మ్యాచ్ ఆడి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో
By Medi Samrat Published on 23 Oct 2023 1:05 PM ISTప్రపంచకప్-2023లో ఆదివారం తన తొలి మ్యాచ్ ఆడి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆపై న్యూజిలాండ్‌పై భారత్ 12 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో 20 ఏళ్ల తర్వాత తొలిసారి కివీస్‌ను భారత్ ఓడించింది. అద్భుతమైన ఆటతీరు కనబరిచిన షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే.. షమీ ప్లేయింగ్ 11లోకి వచ్చిన వెంటనే ఎలా సక్సెస్ అయ్యాడో చెప్పాడు.
న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులు చేసింది. గాయపడిన హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలను చేర్చారు. షమీ తన స్పెల్‌లోని మొదటి బంతికే విల్ యంగ్‌ను బౌల్డ్ చేశాడు. దీని తర్వాత షమీ విధ్వంసం ఇన్నింగ్స్ అంతటా కనిపించింది. దీంతో ఎన్నో రికార్డులు కూడా సృష్టించాడు.
ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా ఎలా సన్నద్ధమయ్యాడో మ్యాచ్ అనంతరం షమీ విలేకరుల సమావేశంలో చెప్పాడు. తన ఫామ్‌హౌస్‌లో పిచ్‌ను సిద్ధం చేశానని.. దానిపై ప్రాక్టీస్ చేయడం తనకు చాలా సహాయపడిందని షమీ చెప్పాడు. ఈ కారణంగానే కచ్చితమైన దిశలో బౌలింగ్ చేసి విజయం సాధించినట్లు తెలిపాడు.
నేను నా ఫామ్‌హౌస్‌లో నాకు, నా తమ్ముడి కోసం ఒక పిచ్‌ను సిద్ధం చేసాను. ఇంటికి వెళ్లిన తర్వాత ఆటగాళ్లు కాస్త రిలాక్స్ అవుతారు. కానీ నా ఫామ్‌హౌస్‌లో బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాను. నేను చాలా కష్టపడి నా లైన్ అండ్ లెంగ్త్‌పై చాలా శ్రద్ధ పెట్టాను. ఈ కారణంగానే నాకు మంచి లైన్ లెంగ్త్, వికెట్లు దక్కాయని విజయం వెనుక రహస్యాన్ని చెప్పాడు.
ధర్మశాల పిచ్‌పై మాట్లాడుతూ.. “నేను లైన్ అండ్ లెంగ్త్‌పై పూర్తిగా దృష్టి పెట్టాను. ఈ రకమైన పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్ అత్యంత ప్రభావం చూపుతుంది. నా ఆటతీరు పట్ల నేను సంతోషంగా ఉన్నానని తెలిపారు.