ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా.. ఎఫెక్ట్ 'ఇమామ్ ఉల్ హక్‌'పై ప‌డింది..!

పాకిస్థాన్ జట్టులో అనిశ్చితి నెల‌కొంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బాబర్ ఆజామ్ వాతావ‌ర‌ణం స‌రిగా లేదు.

By Medi Samrat  Published on  31 Oct 2023 12:56 PM GMT
ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా.. ఎఫెక్ట్ ఇమామ్ ఉల్ హక్‌పై ప‌డింది..!

పాకిస్థాన్ జట్టులో అనిశ్చితి నెల‌కొంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బాబర్ ఆజామ్ మ‌ధ్య‌ వాతావ‌ర‌ణం స‌రిగా లేదు. జకా అష్రఫ్.. బాబర్ ఫోన్ కాల్స్‌ కూడా స్వీకరించడం లేదని.. ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు అందలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆరోపించారు. ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్‌గా ఎన్నికైన మాజీ వెటరన్ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఒక్కరోజులోనే మరో షాకింగ్‌ సంఘటన జరిగింది.

ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ మంగళవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న‌ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ప్లేయింగ్‌-11 నుంచి తొలగించబడ్డాడు. ఇమామ్ ఫామ్‌లో లేడు. అయినప్పటికీ.. అతనికి అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజమామ్ కారణంగానే అతడిని ప్లేయింగ్‌-11లో చేర్చారని పాక్ అభిమానులు, మీడియా ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇంజమామ్ రాజీనామా తర్వాత ఇమామ్ ప్లేయింగ్‌-11లో ప్లేస్ కోల్పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్రపంచకప్ టోర్నమెంట్ మధ్యలో ఉండ‌గా సోమవారం ఇంజమామ్-ఉల్-హక్ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. ఇంజమామ్ తన రాజీనామాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రాఫ్‌కు పంపాడు. దీంతో పాక్ క్రికెట్ బోర్డు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమి మూట‌గ‌ట్టుకుంది.

ఈరోజు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ సమయంలో ఇమామ్ ఉల్ హక్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌లను ప‌క్క‌కు పెట్టిన‌ట్లు కెప్టెన్‌ బాబర్ ఆజామ్ తెలిపాడు.

Next Story