World Cup-2023: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ, భారీ జరిమానా
సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటేయిన్ చేసినందుకు ఐసీసీ పాకిస్థాన్ టీమ్‌కు భారీ జరిమానా విధించింది.
By Srikanth Gundamalla
World Cup-2023: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ, భారీ జరిమానా
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస ఓటములతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటేయిన్ చేసినందుకు ఐసీసీ ఆ టీమ్‌కు భారీ జరిమానా విధించింది.
చెన్నైలోని చెపాక్ వేదికగా శుక్రవారం సౌతాఫ్రికాతో పాకిస్థాన్ జట్టు తలపడిని విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో పాక్‌పై విజయం సాధించింది. చివరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే.. మ్యాచ్‌లో పాక్ విధించిన లక్ష్య చేధనలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్కరమ్ 91 పరుగులతో తన టీమ్‌ను గట్టెంక్కించాడు. ఆ తర్వాత అతడు ఔట్ కావడంతో ఆఖరి వరకు హైడ్రామా కొనసాగింది. గెలుపునకు చేరువగా వచ్చిన సౌతాఫ్రికా 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. తొమ్మిదో వికెట్ పడగొట్టిన పాక్.. ఆఖరి వికెట్ కోసం 11 బంతుల పాటు పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ 48వ ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనట్లు తేలడంతో ఐసీసీ ఫైన్ వేసింది. జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో వేయాల్సిన దానికంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు.. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఈ విషయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ అవసరం లేకుండా ఫైన్ వేసినట్లు వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని సమాచారం. తాజాగా మ్యాచ్ ఫీజులో కోత పడటం పాక్ జట్టు పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.