మంత్రం జపించిన హార్దిక్.. వెంటనే వికెట్ పడింది..!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 14 Oct 2023 2:26 PM GMTఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్ నిలకడగా ఆడింది. అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. మహ్మద్ సిరాజ్ షఫీక్ ను, హార్దిక్ పాండ్యా ఇమామ్ ఉల్ హక్ ను పెవిలియన్ కు పంపారు. అయితే ఈ రెండు వికెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
షఫీక్ 23 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత రోహిత్‌కి కొన్ని చిట్కాలు ఇవ్వడం కనిపించింది. ఆ సమయంలో రోహిత్ శ్రద్ధగా వింటూ కనిపించాడు. టిప్స్ తీసుకున్న వెంటనే రోహిత్ సిరాజ్ తో మాట్లాడి ఫీల్డింగ్ లో మార్పులు చేశాడు. సిరాజ్ ఆ తర్వాతి బంతిని అంటే ఎనిమిదో ఓవర్ చివరి బంతిని బౌల్ చేశాడు. షఫీక్ ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
దీని తర్వాత 13వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతికి ఇమామ్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి హార్దిక్ తన రెండు చేతుల్లో బంతిని పట్టుకుని, అతని ముఖం దగ్గరికి తీసుకుని బంతి వైపు చూస్తూ.. ఏదో మంత్రం జపించినట్లు కనిపించాడు. ఆ బంతికే ఇమామ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు.
వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. హార్దిక్ మంత్రం చదువుతున్నాడు. అతను మ్యాజిక్ చేసాడు.. ఇమామ్ అవుట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇమామ్ 38 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసి ఇన్నింగ్స్ చేశాడు. ఇమామ్ పెవిలియన్‌కు వెళ్తుండగా.. హార్దిక్ బై-బై అంటూ సైగ చేశాడు.