కోహ్లీ డ‌కౌట్‌పై ట్రోలింగ్‌.. దిమ్మ తిరిగే కౌంట‌రిచ్చిన 'ది భారత్‌ ఆర్మీ'

ప్రపంచకప్ 29వ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  30 Oct 2023 5:56 PM IST
కోహ్లీ డ‌కౌట్‌పై ట్రోలింగ్‌.. దిమ్మ తిరిగే కౌంట‌రిచ్చిన ది భారత్‌ ఆర్మీ

ప్రపంచకప్ 29వ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజ‌యంతో టోర్నీలో టీమిండియా వరుసగా ఆరో విజయం సాధించింది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. విరాట్ డ‌కౌట్‌ తర్వాత.. 'ఇంగ్లాండ్ భార్మీ ఆర్మీ' సోషల్ మీడియాలో విరాట్ గురించి ఫన్నీ పోస్ట్ చేసింది. దీనికి సమాధానంగా 'ది భారత ఆర్మీ' ఏమాత్రం ఆలస్యం చేయకుండా కౌంట‌ర్ ఇచ్చింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇంగ్లండ్ కు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. ఛేజ్ మాస్టర్ డ‌కౌట్ అయిన వెంటనే.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని షేర్ చేసింది. అందులో విరాట్ బాతుపై కూర్చున్నట్లు కనిపిస్తాడు. 'ఇప్పుడే మార్నింగ్ వాక్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాను' అని క్యాప్షన్‌లో రాశారు.

అయితే ఈ పోస్ట్‌కి సమాధానంగా ది భారత ఆర్మీ పేజీ నుంచి దిమ్మ‌తిరిగే కౌంట‌రిచ్చింది. భారత్ తరఫున విరాట్ ఖాతా తెరవడంలో విఫలమవగా.. ఇంగ్లండ్ తరఫున జో రూట్, బెన్ స్టోక్స్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్‌ ఆర్మీ వారి చిత్రాల‌ను తీసి.. విరాట్ పోస్ట్‌కు బ‌దులిస్తూ పోస్ట్ చేసింది. రూట్ ఫోటోకు 'సాయంత్రం వాక్‌కు ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చాను' అనే రివ‌ర్స్ కౌంట‌రిచ్చింది.

స్టోక్స్ ఔట్ అయిన తర్వాత భారత్ ఆర్మీ మరో పోస్ట్ చేసింది. స్టోక్స్ బాతుపై ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి.. 'మాకు ఎడిట్ చేయడానికి కొంత సమయం ఇవ్వండి' అని క్యాప్షన్‌లో రాసింది. ఆ తర్వాత కూడా 'ది భారత ఆర్మీ' ఆగలేదు. మార్క్ వుడ్ కూడా డ‌కౌట్ అవ‌గా.. గుడ్ నైట్ అనే క్యాప్షన్‌తో జో రూట్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ బాతుల‌పై ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇంగ్లాండ్ భార్మీ ఆర్మీ ఇంగ్లాండ్ క్రికెట్ టీం స‌పోర్టర్స్ అకౌంట్ కాగా.. ది భారత ఆర్మీ టీమిండియా స‌ఫోర్ట‌ర్స్ అకౌంట్‌.

ఇంగ్లాండ్ టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుసగా ఆరో మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

Next Story