కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే 'చలోనా' అని ఒకడు ఆనందపడుతున్నాడు

By రాణి  Published on  18 March 2020 8:39 AM GMT
కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే చలోనా అని ఒకడు ఆనందపడుతున్నాడు

వెనకటికి ఒకాయన ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సిగరెట్ కాల్చుకోవడానికి బోలెడంత నిప్పు దొరికిందని సంబరపడిపోయాడట. ఇదిగో కొందరికి కరోనా వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే అందులో బోలెడన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. “ఇంతకన్నా మంచి టైమ్ ఇంకేముంటుంది” అంటూ సంబరపడిపోతున్నారట.

ఎవరికి వారు ఇళ్లకు పరిమితమై, ఇతరులను తాకకుండా, కరోనా సోకకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం దేశ విదేశాల ప్రయాణానికి ఇంతకన్నా మంచి సమయం లేదని విమానం టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు. విమాన ప్రయాణ ధరలు బాగా పడిపోవడంతో వరల్డ్ టూర్ చేయడానికి రెడీ అవుతున్నారు. “అంతా మామూలైపోయిన తరువాత మళ్లీ ప్రయాణాలు పెరుగుతాయి. అప్పుడు విమాన ప్రయాణ ధరలు కూడా పెరుగుతాయి. అదే జరిగితే నా లాంటి వాడు ప్రయాణం చేయడం కష్టమౌతుంది. అందుకే ఈ నెల రోజుల్లో మూడు చోట్లకు విమానంలో వెళ్లి వచ్చేశాను” అంటున్నాడు అమెరికన్ డిజైనర్ డీ సిమోన్. “ఒక వేళ కరోనా వచ్చిప్రపంచం అంతమైపోతే నేను ఎలాగో అంతం అవాల్సిందే. కోరికలు తీర్చుకుని చనిపోతే ఆ కిక్కే వేరప్పా” అంటున్నాడు సిమోన్.

Also Read : క్వారంటైన్ అంటే ఏమిటి ?

అమెరికాలో మొదట్లో కరోనా వల్ల ఫ్లైట్ బుకింగ్ లు తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఇరవైశాతం పెరిగాయి. ఈ విషయాన్ని విమాన యాన సంస్థలే కన్ ఫర్మ్ చేస్తున్నాయి. సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, న్యూ జెర్సీ వంటి నగరాలలో ఫ్లైట్ బుకింగ్స్ బాగా పెరిగాయి. వర్క్ ఫ్రం హోం విధానం వచ్చిన తరువాత తమ ఊరి నుంచి దూరప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి పనిచేయడం బాగా పెరిగింది. ఖాళీ సమయాల్లో పర్యాటక స్థలాలను సందర్శించి, డ్యూటీ సమయాల్లో లాగిన్ అవుతున్నారట.

Also Read : తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో..మీకు తెలుసా ?

అయితే ఇలా చేయడం వల్ల వీరంతా వైరస్ ను ఒకచోట నుంచి మరొక చోటకి మోసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయకూడదని ప్రభుత్వాలు, వైద్యా సంస్థలు సలహా ఇస్తున్నాయి. అయితే యువతరం ఈ మాటను పెద్దగా వినడం లేదు. అయితే ఈ వ్యాధి వల్ల యువకులకు పెద్దగా ప్రమాదం లేదని, వ్యాధి సోకిన వారిలో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువని ఇలా ప్రయాణాలు చేసేవారు ధీమాగా చెబుతున్నారు. గతంలో ఎబోలా, సార్స్, స్వైన్ ఫ్లూ వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా తాము పర్యటనలు చేశామని వారంటున్నారు.

అవును కదా...మనవాళ్లు ఎప్పుడో చెప్పారు..ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

Next Story