రియల్ ఎస్టేట్ కొంపముంచనున్న వర్క్ ఫ్రం హోం
By సుభాష్ Published on 30 July 2020 8:35 AM ISTరియల్ ఎస్టేట్ కు వర్క్ ఫ్రం హోం గండం
కరోనా మహమ్మారి మనకెన్నో బ్రతుకు పాఠాలు నేర్పింది. వాటిలో ముఖ్యమైనది పొదుపు. అందుకే కరోనా కాలంలో చాలామంది పొదుపుపై ఫోకస్ పెట్టారు. అరకొర జీతాలతో....పడిపోయిన వ్యాపారాలతో నిత్యావసరాలకు, అత్యవసరాలకు తప్ప మిగతా వాటిపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఏ మాత్రం మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి దెబ్బకు అన్నిరంగాలతోపాటు....రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్ధిక లావాదేవీలు పాతాళానికి పడిపోయాయి. ఇళ్ల సంగతి ఎలా ఉన్నా....కమర్షియల్ భవనాల్లో స్పేస్ ధరలు తగ్గుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసి...అందినకాడికి అమ్ముకుందామని బిల్డర్లు రెడీగా ఉన్నారు. ఇక, కొన్ని కమర్షియల్ బిల్డింగులను నివాస స్థలాలుగా మార్చేందుకూ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోంకే చాలా సంస్థలు మొగ్గు చూపడంతో కొత్తగా బిల్డింగ్ లు నిర్మించడం, అద్దెలకు తీసుకోవడం జరిగే పనికాదు.
రియల్ ఎస్టేట్ రంగంపై వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్ బాగాపడింది. కరోనా దెబ్బకు ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసే అవసరం లేకుండానే తప్పనసరిగా వర్క్ ఫ్రం హోం కింద పనిచేయాల్సిన అవసరం వచ్చింది. అవకాశం ఉన్న అన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపుతున్నాయి. భద్రతాపరమైన సమస్యలు అధికంగా ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వర్క్ ఫ్రం హోంతోనే బండి నెట్టుకువస్తోంది. ఏదో రెండు మూడు నెలలనుకుంటే...ఇప్పటి నుంచి ఏకంగా ఏడాది తప్పనిసరిగా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది కరోనా. దీంతో, తమ తమ ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం కు కంపెనీలు జై కొడితే....భవిష్యత్తులోనూ నగరాల్లో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయే ప్రమాదం ఉంది.