అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

By సుభాష్  Published on  29 July 2020 3:11 PM GMT
అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

అయోధ్యలో రామాలయం నిర్మాణం త్వరలో జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆగస్ట్‌ 5న ఉదయం అయోధ్యలో రామాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ఇటీవలే విడుదల చేసింది. కాగా.. ప్రధాని పర్యటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..!

ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు. భూమి పూజకు అధికారిక హోదాలో ప్రధాని హాజరైతే అది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని అన్నారు.

అసదుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ చవకబారు విమర్శలు చేస్తున్నారని.. రామాలయం కేవలం హిందూ మతస్థులకు మాత్రమే చెందినది కాదని.. ఇది భారతీయుల ఆలయమని చెప్పారు.సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరుకునే మోదీ... హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా, భూమి పూజలో పాల్గొనడం చారిత్రక అవసరమని అన్నారు.

కోట్లాది మంది ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొనడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని.. 400 ఏళ్లుగా అయోధ్యలో బాబ్రీ మసీదు ఉందనే విషయం నిజమైతే... అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామాలయ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామాలయ నిర్మాణ భూమి పూజకు దయచేసి ఎవరూ రావాలని అనుకోవద్దని, ఆ రోజు సాయంత్రం అందరూ ఇళ్లలోనే ఉండి దీపాలు వెలిగించాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజలను కోరింది. రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడికి రావాలని ఎవరూ అనుకోవద్దని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని.. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ప్రత్యక్ష కార్యక్రమాన్ని తిలకించాలని కోరారు.

Next Story