వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 9:12 AM GMT
వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

అమరావతి: చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ నాయకులు ఇసుకను అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఎల్లోమీడియా ఇసుకపై చంద్రబాబుకు అనుకూలంగా ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వరదల వల్ల ఇసుక కొరత కొంత ఉన్న మాట వాస్తమేన్నారు. లోకేష్‌ ఇసుక దీక్ష డైటింగ్‌ కోసం చేస్తున్నట్టుగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఓ రాజకీయ దళారి.. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్నారు.

చంద్రబాబు నివాసం పక్కనే అప్పటి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇసుక మాఫియాకు పాల్పడింది మీ కళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలు మీ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇసుక కొరత నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర వనరులు సరిగా వాడుకోవాలన్న లక్ష్యంతోనే సీఎం జగన్‌ పని చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

సీఎం జగన్‌పై ధ్వజమెత్తిన మాజీమంత్రి యనమల

ఇసుకపై సీఎం జగన్‌ వ్యాఖ్యలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. సీఎం జగన్‌ 'ఇసుక వారోత్సవాలు' అనడం సిగ్గుచేటన్నారు. ఎందుకు ఇసుక వారోత్సవాలు..? ఇసుక దొరకనందుకు వారోత్సవాల..? అంటూ సీఎం జగన్‌పై యనమల మండిపడ్డారు. టీడీపీ చరిత్ర ముగిసిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. చరిత్ర ముగిసిందన్న వాళ్లే చరిత్రలో కలిసి పోయారని.. ఇలాగే అరాచకాలకు పాల్పడితే వైసీపీ చరిత్ర ముగిసే రోజు త్వరలోనే ఉందన్నారు. అమరావతిలో సింగపూర్‌ స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు మోకాలడ్డారని యనమల ఆరోపించారు. అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీని చేయాలని చూస్తున్నారని, పేదల సంక్షేమాన్ని కుంటుపరుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యవహార శైలి రాష్ట్రానికి చేటుగా మారిందని యనమల రామకృష్ణుడు అన్నారు.

Next Story