ఆక్స్ ఫర్డ్ డిక్షనరీపై ఆడాళ్లకు కోపం వచ్చిందోచ్

By రాణి  Published on  5 March 2020 11:08 AM GMT
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీపై ఆడాళ్లకు కోపం వచ్చిందోచ్

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారి డిక్షనరీలు వరల్డ్ ఫేమస్. ఆక్స్ ఫర్డ్ అనగానే అందరూ గౌరవంతో తలలు వంచుతారు. కానీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. కొందరు ఫెమినిస్టులు ఆక్స్ ఫర్డ్ కి పురుషాధిక్యాహంకార నేరం అంటగడుతున్నారు. మగవారి విషయంలో సౌమ్యమైన పదాలు వాడి, స్త్రీల దగ్గరికి వచ్చే సరికి రెచ్చిపోతున్నారని ఆక్స్ ఫర్డ్ వారిని ఆక్షేపిస్తున్నారు. అంతటితో ఆగక వుమెన్స్ ఎయిడ్, వుమెన్స్ ఈక్వాలిటీ పార్టీ మరి కొందరు కలిసి ఒక ఫిర్యాదు కూడా చేశారు. అంతే కాదు. డియోవానార్డి అనే మహిళ ఒక ఆన్ లైన్ పిటిషన్ కూడా పెట్టింది. దానిపై ఇప్పటికే 32000 మంది సంతకాలు కూడా చేసేశారు.

వారి అభ్యంతరాలు కూడా కాస్త సబబుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇంగ్లీష్ లో బిచ్ (అసలు అర్థం ఆడకుక్క) అన్న పదాన్ని ఆడది అన్న అర్థంలో కూడా వాడతారు. అదే విధంగా మెయిడ్ (ఆడపనిమనిషి) అన్న పదానికి ఇచ్చిన అనేక అర్థాల్లో ఆడది అన్న అర్థం కూడా ఉంది. “అంటే ఆడాళ్లు కుక్కలా, కేవలం పనిమనుషులా, కాదు కాదు కాకూడదు... అందుకే ముందు అర్థం మార్చు” అంటున్నారట మహిళా సంస్థలు. అదే మ్యాన్ అన్న పదానికి పురుష లక్షణాలున్న వ్యక్తి ఆక్స్ ఫర్డ్ అర్థం చెబుతోంది. అక్కడితో ఆగితే బాగుండేది. ఒకడుగు ముందుకు వేసి ధైర్యం, సాహసం, దారుఢ్యం వంటివి పురుష లక్షణాలని ఆక్స్ ఫర్డ్ నిర్వచనం చెప్పింది. కాబట్టి మహిళలను కించపరిచే నిర్వచనాలు ఇవ్వడం తగదని వీరు వాదిస్తున్నారు. చాలా సందర్బాల్లో అర్థాన్ని వివరించేందుకు ఇచ్చిన వాక్యాలలోనూ ఆడదాన్ని అవమానించారని ఈ సంస్థలు చెబుతున్నారు. పర్యాయపదాలు వాడేటప్పుడు కూడా మహిళలను కించపరచడం జరుగుతోందని వారంటున్నారు.

“భాష భావాలను పంచుతుంది. తప్పుబు భావాలను పంచితే తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. దాని వల్ల మహిళల విషయంలో తప్పుడు భావనలు ఏర్పడే ప్రమాదం ఉంది” అని మహిళలు వాదిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ వారు మాత్రం వాడకంలో ఉన్న పదాలను తాము ఉపయోగించామే తప్ప మరో దురుద్దేశం తమకు లేదని సంజాయిషీ ఇస్తున్నారు. తాము ప్రజలు వాడే భాషను మార్చలేమని, తాము వాడకంలో ఉన్న పదాల అర్థాలను మాత్రమే ఇచ్చామని వారంటున్నారు. ప్రజల భాష మారి, ఈ తరహా పదాలు ఉపయోగంలో లేకుండాపోతే తాము కూడా మార్పులు చేస్తామని వారంటున్నారు.

Next Story