మహిళా రైతును తొక్కి చంపిన ఏనుగు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Dec 2019 7:17 PM ISTవిజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామ సమీపంలో ఓ వివాహితను ఏనుగు అత్యంత కిరాతకంగా తొక్కి చంపింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి(55) అనే మహిళా రైతు తన పొలంలో పత్తి సేకరిస్తూ పనిలో నిమగ్నమైంది.
చిన్నమ్మి తన పొలంవైపు వస్తున్న ఏనుగును గమనించలేదు. చిన్నమ్మి సమీపానికి వచ్చిన ఆ ఏనుగు.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి.. తరువాత కాళ్లతో తొక్కడంతో చిన్నమ్మి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో బాసంగి గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
చిన్నమ్మి మరణంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమెకు భర్త అప్పలస్వామి, కుమారులు శ్రీనివాసరావు, గౌరినాయుడు, కుమార్తె సావిత్రమ్మ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కురుపాం ఫారెస్టు అధికారులు హుటావుటిన ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు.
అయితే ఏనుగులు.. ఈ ఏడాదిలోనే ముగ్గురిని మృత్యుఒడికి చేర్చాయి. జనవరిలో కొమరాడ మండలం నాయుడుగూడ గ్రామానికి చెందిన నిమ్మక పకీరును చంపాయి. మే నెలలో జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామానికి చెందిన కైదు కాశన్నదొర(77)ను హతమార్చాయి. ఈ ఇద్దరి మరణాలు మరిచిపోకముందే ఏనుగులు గంట చిన్నమ్మిని చంపిన తీరు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.