తెలంగాణలో మరో దారుణం.. పోలీసులమని చెప్పి మహిళపై ముగ్గురు అత్యాచారం

By సుభాష్  Published on  11 Feb 2020 1:02 PM GMT
తెలంగాణలో మరో దారుణం.. పోలీసులమని చెప్పి మహిళపై ముగ్గురు అత్యాచారం

దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల అగడాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని జహీరాబాద్‌లో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సులో వెళ్తున్న మహిళను పోలీసులమని నమ్మించి నీచులు బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేటకు చెందిన వివాహిత (37) తన కొడుకుతో కలిసి ఇటీవల కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లింది. సోమవారం రాత్రి బీదర్‌ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఆమె ప్రయాణిస్తున్న బస్సు జహీరాబాద్‌కు చేరుకోగా, పోలీసు దుస్తుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. ముగ్గురు మహిళ వద్దకెళ్లి నిషేధిత వస్తువులున్నట్లు తమకు సమాచారం అందిందని, తనిఖీలు చేయాలని తల్లీకొడుకులను బస్సు కిందకు దింపేశారు. ఇద్దరు వ్యక్తులు ఆమె లగేజీని పట్టుకోగా, మరో వ్యక్తి మీతో మాట్లాడాలంటూ మహిళను పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని కూడా బెదిరించారు.

మహిళపై అత్యాచారం జరిపిన తర్వాత ఆమెను రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఇక నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలు జహీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులతో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story
Share it