ముఖ్యాంశాలు

  • ఢిల్లీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు
  • గడిచిన 120 ఏళ్లలో యూపీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
  • వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం
  • చలితీవ్రతకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. జమ్ముకశ్మీర్‌, హిమచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా చలి పంజా విసురుతోంది. చలి కారణంగా ఢిల్లీలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో 29 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసుకుల తీవ్ర అంతరాయం కలిగింది. 20కిపైగా విమానాలను అధికారులు దారి మళ్లించారు. మరో నాలుగు విమానాలను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రత సున్నాకు పడిపోయింది. గడిచిన 120 ఏళ్లలో యూపీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. యూపీలో పగటిపూట కూడా ఉష్ణోగ్రత 10 డిగ్రీలు కూడా దాటడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చ‌లితీవ్ర‌త‌కు జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క‌ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలోనే చలి తీవ్రతకు 28 మంది మృత్యువాత పడ్డారు. కాగా, శ‌ని, ఆది వారాల్లో కూడా చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. యూపీ ప్రభుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించనప్పటికీ వివిధ జిల్లాలలో ఉన్న‌ లెక్క‌ల ప్ర‌కారం కాన్పూర్‌లో 10 మంది, వారణాసిలో నలుగురు, మహోబాలో నలుగురు, శ్రావస్తి, బాందా, మెయిన్‌పురిల్లో ఇద్దరు, లక్నోలో ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇదిలావుంటే.. అలీగఢ్‌లో అత్పల్పంగా 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, గరిష్టంగా 11.2గా ఉంది. లక్నోలో కనిష్ట ఉష్ణోగ్రత 7.7గా, గరిష్ట ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే.. ఈ సీజన్‌లోనే అతి త‌క్కువ‌ ఉష్ణోగ్రత డిల్లీలో నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. గ్రేటర్‌ నోయిడాలో పొగమంచు కారణంగా ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్లపై పొగ మంచు పరుచుకొని ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.