లక్షల్లో లాటరీ గెలిచాడు.. కానీ ఏం లాభం!

దేనికైనా రాసిపెట్టుండాలి.. లేకుంటే అది మనకు దక్కదు. ఇది మనం తరచూ మన పెద్దల నుంచి వింటుంటాం. కేరళలోని ఓ వ్యక్తికి రూ. 60లక్షలు విలువచేసే లాటరీ వరించింది. దాన్ని పొందేందుకు వెళ్లగా అతనికి గుండెపోటు వచ్చి మృతిచెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదాన్ని నింపింది.

కేరళ రాష్ట్రం అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి. తంబి దుకాణం నిర్వహిస్తున్నాడు. తంబి ఇటీవల తన దుకాణంలో స్త్రీ శక్తి లాటరీలు కూడా తెచ్చి విక్రయించాడు. తన వద్ద ఉన్న లాటరీలన్నీ విక్రయించగా.. చివరగా కొన్ని టికెట్లు మాత్రం మిగిలిపోవటంతో తన వద్దనే ఉంచుకున్నాడు. లాటరీ ఫలితాలు రావటంతో అతడి వద్ద ఉన్న టికెట్‌లో ఒకదానికి రూ. 60లక్షల బహుమతి తగిలింది. ఉబ్బితబ్బిపోయిన తంబి తన కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నాడు. గ్రామస్తులంతా అదృష్టవంతుడివి అంటూ అభినందించారు. కాగా ఆ నగదును తెచ్చుకొనేందుకు స్థానికంగా ఉన్న ఫెడరల్‌ బ్యాంక్‌కు వెళ్లి తనకు వచ్చిన లాటరీ టికెట్‌ను అందించాడు.

ఇదే సమయంలో అతనికి ఛాతి నొప్పి రాడంతో ఒక్కసారిగా బ్యాంకు కౌంటర్‌ వద్దనే కుప్పకూలిపోయాడు. అతన్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తంబి మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. లాటరీ తగలకపోయినా ప్రాణమైన మిగిలేది అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. గ్రామంలో విషాద చాయలు అలముకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *