మద్యం ప్రియులకు శుభవార్త: తెరుచుకోనున్న మద్యం షాపులు.!
By సుభాష్ Published on 12 April 2020 2:27 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా అన్ని షాపులతో పాటు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దీంతో మందుబాబులకు ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. మందులేక మద్యం ప్రియులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలున్నాయి. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మద్యం బాబులు. ఇక మద్యం ప్రియుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రాష్ట్రంలో వైన్స్ షాపులు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, ఈ 5 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు తెరించేందుకు మేఘాలయ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, అందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వైన్స్ షాపుల వద్ద ఒక మీటర్ సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగ్గా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లడంపై నిషేధం విధించింది. అలాగే కేవలం ఇంటికి ఒక్కరినే మద్యం షాపు వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. వైన్స్ షాపు వద్దకు వచ్చిన కస్టమర్లకు హ్యాండ్ శానిటైజర్లను అందించాలని సూచించింది ప్రభుత్వం.
కాగా, మేఘాలయ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.