కోహ్లీ మూసుకుని బ్యాటింగ్ చెయ్
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 1:23 PM ISTజెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌లో అప్పుడప్పుడూ వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి ఘటనల్లో ఒకటే నోట్‌బుక్ వివాదం. ఈ వివాదాన్ని క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా ఏమీ మరిచిపోరు. వెస్టిండీస్ ఆటగాడు కెస్రిక్ విలియమ్స్, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ల మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. గతేడాది వెస్టిండీస్‌తో టీ20 సీరిస్‌లో ఆ జట్టు పేసర్ కెస్రిక్ విలియమ్స్ సన్ బౌలింగ్‌లో కోహ్లీ సిక్సర్ బాదాక.. నోట్‌బుక్‌లో టిక్ పెడుతున్నట్టుగా సంబరాలు చేసుకోవడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. అయితే.. అది విలియమ్స్ శైలి. కాగా.. ఆ రోజు కోహ్లీ ఎందుకు అలా చేశాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విలియమ్స్ తెలిపాడు.
భారత జట్టు విండీస్ పర్యటకు వచ్చింది. అప్పుడు జమైకాలో జరిగిన ఓ వన్డేలో కోహ్లీ వికెట్ తీశాక నేను తొలి సారి నోట్‌బుక్ సంబరాలు జరుపుకున్నా.. కేవలం అది అభిమానులను అలరించడానికే చేశానని చెప్పాడు. అయితే.. కోహ్లీ మాత్రం ఆ కోణంలో చూడలేదని, మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చేటప్పుడు నీ బౌలింగ్ బాగుందని మాత్రం కోహ్లీ మెచ్చుకున్నాడని తెలిపాడు.
ఈ సారి విండీస్ 2019లో భారత పర్యటనకు వచ్చింది. హైదరాబాద్‌లో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. వికెట్ పడిన తరువాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ రోజు రాత్రి నీకు నోట్‌బుక్ సంబరాలు చేసుకునే అవకాశం ఇవ్వనని నాతో అన్నాడు. దాదాపు ప్రతి బంతికి కోహ్లీ ఎదో ఒకటి అంటూనే ఉన్నాడు. అప్పుడు కోహ్లీతో ఒకటే చెప్పాను. ఫ్రెండ్ నోరు మూసుకుని బ్యాటింగ్ చేయ్. నీ ప్రవర్తన చిన్న పిల్లాడిలా ఉందని చెప్పా. అయితే.. కోహ్లీ అందులో సగం మాత్రమే విన్నాడు. ఇక ఆరాత్రి నన్ను లక్ష్యంగా చేసుకుని కోహ్లీ బాదడం మొదలు పెట్టాడు. నా బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదాక కోహ్లీ నా శైలిని అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నాడని విలియమ్ సన్ వివరించాడు.
నిజానికి కోహ్లీ ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ ఆటగాడు. అతనితో సవాలును తాను ఇష్టపడుతున్నాన్ని చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 208 పరుగులు చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. కోహ్లీ 50 బంతుల్లోనే 94 రన్స్‌తో చేయడంతో 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్నోయి విజయాన్ని సాధించింది.