ముషారఫ్‌కు ఉరిశిక్ష పడేనా..?
By సుభాష్ Published on 4 Jan 2020 1:14 PM GMTముఖ్యాంశాలు
ముషారఫ్‌ను కాపాడేందుకు ఇమ్రాన్ సర్కార్ ప్రయత్నాలు
నాలుగేళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న ముషారఫ్
ముషారఫ్‌ను పట్టుకోవడంలో పోలీసులకు కత్తిమీద సాము
పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కు ఇటీవల ఇస్లామాబాద్ స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన స్పెషల్ కోర్టు దోషిగా తేలుస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముషారఫ్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. కోర్టు ఇచ్చిన తీర్పుపై బహిరంగంగా మాట్లాడలేక, అలా అని ముషారఫ్‌ను వెనకేసుకురాలేక సతమతమవుతోంది. కాగా, పౌర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో సైన్యానిదే కీలక పాత్ర. ఇది బహిరంగ రహస్యమే అయినా.. సైన్యాన్ని కాదని ఏ ప్రధాని కూడా ముందుకెళ్లే సహసం చేయరు. గత ఏడాది సైన్యం మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్‌ఖాన్ అంత దూరం వెళ్లలేరనే చెప్పాలి. మొత్తం మీద ఏదో ఒక విధంగా ముషారఫ్‌ను కాపాడేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుంది.
ముషారఫ్ చేసిన నేరమేంటి..
అక్టోబర్, 1999లో ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ శ్రీలంక పర్యటనకు వెళ్లగా, అప్పటి సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర ద్వారా తిరుగుబాటు చేశారు. షరీఫ్‌ను గద్దెదించి అధికార పగ్గాలు చేతికందుకున్నాడు. ఈ సందర్భంగానే రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేశారు. మీడియా గొంతు కూడా నొక్కి అందరికి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అలాగే అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తాకర్ మహ్మద్ సహా పలువురు న్యాయమూర్తులను గృహ నిర్భంధం చేశారు. ఇక కొత్త రాజ్యాంగాన్ని ముషారఫ్ తీసుకువచ్చి దాని ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయమని న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకువచ్చారు. పాత రాజ్యాంగం ప్రకారం దానిని రద్దు చేసినా.. దుర్వినియోగం చేసినా ఆరో అధికారం ప్రకారం దేశ ద్రోహం కిందికే వస్తుంది. ఈ నేరానికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ప్రత్యేక న్యాయస్థానం. నిజానికి ఆ రోజుల్లో సైన్యంలో ముగ్గురు సీనియర్లను కాదని జూనియర్ అయిన ముషారఫ్‌ను నవాజ్ షరీఫ్‌పైకి తెచ్చి సైన్యాధిపతిని చేశారు. చివరకు అదే ముషారఫ్‌ను ముంచేలా చేసింది.
పగబట్టిన నవాజ్ షరీఫ్..
ఇక పగ తీర్చుకునేలా 2013లో అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ పాత ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. సమయం వచ్చిందని ముషారఫ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయించారు 2015 నాటికే కేసు విచారణ పూర్తయినప్పటికీ వివిధ కారణాలతో ముషారఫ్ కేసు తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ కేసు విచారణను నిర్లక్ష్యం చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఎట్టకేలకు ఇటీవల తీర్పు వెల్లడైంది. ఒక మాజీ ప్రధానికి ఉరిశిక్ష పడటం దేశంలోనే ఇది రెండో సారి కాగా, ఒక సైనిక పాలకుడికి మరణ శిక్ష విధించడం ఇది తొలిసారి అనే చెప్పాలి.
ముషారఫ్‌ను కాపాడేందుకు ఇమ్రాన్ ప్రయత్నాలు
ఉరిశిక్షపడ్డ ముషారఫ్‌ను కాపాడేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాని సైన్యాన్ని కాదని శిక్ష అమలు చేసేంత ఇమ్రాన్‌కు లేదు. ఈ విషయంలో ఇమ్రాన్‌నే కాదు.. ఏ పౌర ప్రభుత్వం సైన్యాన్ని కాదని ముందుకు వెళ్లే ప్రసక్తేలేదు. ఎందుకంటే ఆయన సైన్యం మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ అంత ధైర్యం చేయలేరు. ఇక విదేశాల్లో ఉన్న ముషారఫ్ సజీవంగా పట్టుబడకపోతే చివరకు ఆయన చనిపోయిన తర్వాత కూడా శవాన్ని ఇస్లామాబాద్‌లోని చౌక్‌లో మూడు రోజుల పాటు ఉరితీయాలని కోర్టు స్పష్టం చేసింది. ఏది ఏమైనా ముషారఫ్ శిక్ష అమలుకు సర్కార్ అంతగా చొరవ చూపే అవకాశం లేదనే చెప్పాలి. గత నాలుగేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న ముషారఫ్‌ను పట్టుకోవడమంటే పోలీసులకు కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో మరణశిక్షను విధించిన ముషారఫ్‌ను పాక్ యంత్రాంగం ఏ విధంగా పట్టుకుంటుందో వేచి చూడాలి.