'గంటా 'సీఎం జగన్‌ను ఎందుకు కలవలేదు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 12:35 PM GMT
గంటా సీఎం జగన్‌ను ఎందుకు కలవలేదు..?!

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని 'సైరా' చిరంజీవి కలిశారు. చిరంజీవి దంపతులకు సీఎం జగన్‌ దంపతులు తమ ఇంట్లో సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు శాలువాలు కప్పుకున్నారు. కాని..చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా ఆయన వెంట ఎందుకు లేరు అనే దాని మీద పొలిటికల్ టౌన్‌లో విస్తృత చర్చ జరుగుతుంది. చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు గంటా శ్రీనివాస రావు. చిరంజీవి కాలు బయటపెడితే అక్కడే ఉండే గంటా సీఎం జగన్ ఇంటికి మాత్రం రాలేదు.

గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్‌ సీపీలోకి రావడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు అమరావతిలో ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి సీఎం జగన్ దగ్గరకు గంటా రాయబారం కూడా పంపించారని ప్రచారం కూడా జరిగింది.అయితే..గంటా శ్రీనివాసరావును చేర్చుకోవడంపై సీఎం జగన్‌ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వైఎస్ జగన్‌ ప్రభుత్వానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. గంటా సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు వైఎస్ఆర్‌ సీపీలో బలంగా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు వైఎస్ జగన్ వ్యతిరేకం.అయితే..ఈమధ్య కొంచెం స్ట్రాటజీ మార్చారని చెప్పవచ్చు. గతంలో వైఎస్ఆర్‌ సీపీని వదిలి వెళ్లినా జూపూడి ప్రభాకర్ రావును చేర్చుకున్నారు. అలానే..గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గ నేత, బీజేపీ మాజీ ఎమ్మెల్యే , గత ఎన్నికల్లో జన సేన నుంచి పోటీ చేసిన ఆకుల సత్యనారాయణను చేర్చుకున్నారు. సో...దీంతో గంటాను కూడా చేర్చుకుంటారు అనే టాక్‌ నడిచింది. దీనికి సంబంధించి ఆయన చిరంజీవితో జగన్‌కు ఒక మాట చెప్పించుకుంటారు అని కూడా అందరూ అనుకున్నారు. చిరుతో కలిసి వైఎస్ జగన్‌ను కలిసి ఒక సంకేతం కూడా పంపుతారని అందరూ భావించారు. కాని..అలా జరగలేదు.

పార్టీ మారి వైఎస్ఆర్‌ సీపీలో కి వచ్చే వారికి వైఎస్ జగన్ మొదటి నుంచి ఓ కండీషన్ పెడుతున్నారు. పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి రావాలనేది ఆ కండీషన్. అయితే.. ప్రస్తుతం గంటా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్‌ జగన్ రూల్ ప్రకారం గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి. అలా వస్తారా? రాకపోతే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే..మళ్లీ ఎన్నికలు ..ఇవన్నీ బేరీజు వేసుకుని గంటానే ఆగిపోయారా..?లేదా సీఎం జగనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

మొత్తానికి సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ గంటాకు కాస్తోకూస్తో లైన్ క్లియరే అని చెబుతున్నారు టీడీపీ, వైఎస్ఆర్‌ సీపీ నేతలు.

Next Story
Share it